భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
కొత్తపల్లి: జల్సాలకు అలవాటు పడి, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు, సదరు నిందితుడిని అరెస్ట్ చేశామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎస్సై వెంకటేష్‌తో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వారి కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన రాచపల్లి ప్రసాద్ అదే గ్రామానికి చెందిన గింజాల బాలను తొమ్మిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతను జల్సాలు చేయడమే కాకుండా, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 18న అర్ధరాత్రి సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత బాల మెడకు చున్నీతో ఉరివేసి దిండుతో ఊపిరి ఆడకుండా చేశాడు. బాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాంతులు, విరోచనాలు కావడంతో మృతి చెందిందని ప్రసాద్ సమాచారం అందించాడు. బాల మృతదేహాన్ని తర్వాత రోజు ఖననం చేశారు. బాల తల్లి గింజాల లక్ష్మి తన కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖననం చేసిన మృతదేహాన్ని తర్వాత రోజు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించారు. జనవరి 30న వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా, దర్యాప్తు మేరకు ముద్దాయిపై హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనే సమాచారంతో ప్రసాద్ శనివారం గ్రామ రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోవడంతో అరెస్ట్ చేసి పిఠాపురం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment