గురువులు లేక.. చదువులు బరువు | - | Sakshi
Sakshi News home page

గురువులు లేక.. చదువులు బరువు

Published Wed, Jan 22 2025 12:07 AM | Last Updated on Wed, Jan 22 2025 12:07 AM

గురువ

గురువులు లేక.. చదువులు బరువు

సగం పోస్టులు ఖాళీ

లెక్చరర్లను నియమించాలి

ఇప్పటి వరకూ ఒక్క పూటే తరగతులు నిర్వహించడం వల్ల ఉదయాన్నే ఉరుకులు పరుగులుగా కళాశాలకు రావాల్సి వచ్చేది. క్లాసులు అంతంత మాత్రంగానే జరిగేవి. సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. ప్రస్తుతం కళాశాల నూతన భవనం ప్రారంభం కావడం.. కొత్త తరగతి గదులు అందుబాటులోకి రావడంతో చాలా ఆనందపడ్డాం. కానీ కంప్యూటర్‌ కోర్సులకు లెక్చరర్లు లేక ఇబ్బందిగా ఉంది. వెంటనే లెక్చరర్లను నియమించాలి.

– వి.సత్య, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌,

డిగ్రీ కాలేజీ, పిఠాపురం

ప్రభుత్వానికి

నివేదిక పంపించాం

నూతన కళాశాల భవనం అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో క్లాసులు ప్రారంభించాం. కళాశాలలో సుమారు 130 మంది కంప్యూటర్‌ కోర్సులు చదువుతున్నారు. కానీ, అధ్యాపకులు లేక ఫ్యాకల్టీలతో విద్యా బోధన చేయిస్తున్నాం. అధ్యాపకులను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. త్వరలోనే పోస్టులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం.

– డాక్టర్‌ పి.సుభాషిణి, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఠాపురం

పిఠాపురం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది కూటమి ప్రభుత్వ విద్యా విధానం. కొత్త కొత్త కోర్సులు హడావుడిగా ప్రారంభించేస్తున్న అధికారులు.. దానికి తగినట్లుగా బోధనా సిబ్బందిని నియమించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా చదువు చెప్పే వారు లేక కళాశాలకు ఎందుకు వస్తున్నామో తెలియని అయోమయ పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కాకినాడ, పిఠాపురం, పెరుమాళ్లపురం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పెద్దాపురం ఎంఆర్‌ కాలేజీ, ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ తదితర డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో సుమారు 7 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలల్లో బీఏ ఆనర్స్‌ ఎకనామిక్స్‌, బీకాం ఆనర్స్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఎస్సీ ఆనర్స్‌ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌, బీఎస్సీ ఆనర్స్‌ జువాలజీ తదితర గ్రూపులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా అధ్యాపకులు లేకపోవడంతో డిగ్రీ కళాశాలల్లో బోధన కుంటుపడుతోంది. మామూలు కోర్సులను అరకొరగా ఉన్న సిబ్బందితో నిర్వహిస్తూండగా.. కంప్యూటర్‌ కోర్సులకు అసలు అధ్యాపకులే లేని దుస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 6

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు 3

విద్యార్థులు 7,000

కంప్యూటర్‌ కోర్సు చదువుతున్న వారు 1,500

మొత్తం అధ్యాపక పోస్టులు సుమారు 220

ఖాళీలు సుమారు 85

ఫ డిగ్రీ కళాశాలల్లో కోర్సులు ఫుల్‌

ఫ అధ్యాపకులు నిల్‌

ఫ దాదాపు సగం పోస్టులు ఖాళీ

ఫ బోధించే వారు లేక

విద్యార్థులకు అవస్థలు

నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురంలో ఎన్నో సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల లేక స్థానిక ఈ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో 2008లో పిఠాపురానికి డిగ్రీ కళాశాలను నాటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన హఠాన్మరణానంతరం వచ్చిన పాలకులు ఈ కళాశాల నిర్మాణం గురించి పట్టించుకోలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఓఎన్‌జీసీ సహకారంతో రూ.1.5 కోట్లు కేటాయించారు. 2021 అక్టోబర్‌ 5న కళాశాల నిర్మాణానికి అప్పటి మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల కొత్త భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ 3 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. పెద్దదైన ఈ కళాశాలలో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇలాకాలో ఉన్న ఈ కళాశాలలో 100 మందికి పైగా అధ్యాపకులు ఉండాలి. కానీ, ప్రస్తుతం సుమారు 50 మంది మాత్రమే ఉన్నారు. ఉదాహరణకు బీకాం ఆనర్స్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఎస్సీ ఆనర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు ముగ్గురు అధ్యాపకులు ఉండాలి. కానీ, ఒక్కరు కూడా లేక ఫ్యాకల్టీలతో చదువు చెప్పించాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాగే, ఇతర సబ్జెక్టులకు కూడా అవసరమైన స్థాయిలో అధ్యాపకులు లేరు. పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకూ సొంత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు.. ఇప్పుడు చదువు చెప్పే వారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

విద్యా సంస్థలపై ప్రభుత్వం నిర్లక్ష్యం

విద్యా సంస్థలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలున్నాయి. నూతన విద్యా విధానం అమలు సక్రమంగా జరగడం లేదు. కంప్యూటర్‌ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడం సిగ్గుచేటు. మామూలు కోర్సులైతే పుస్తకాలు చదివి నేర్చుకునే అవకాశం ఉంది. కంప్యూటర్‌ కోర్సులు బోధించే వారు లేకుండా విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు? ఎలా పరీక్షలు రాయగలుగుతారు? ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం.

– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
గురువులు లేక.. చదువులు బరువు1
1/2

గురువులు లేక.. చదువులు బరువు

గురువులు లేక.. చదువులు బరువు2
2/2

గురువులు లేక.. చదువులు బరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement