వచ్చే నెలలో ‘ప్రసాద్’ పనులు
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్ కింద రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశముందని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఆ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ వేంకటేష్, ఆర్కిటెక్ట్ టి.బాలకృష్ణ మంగళవారం రత్నగిరికి వచ్చి, ప్రసాద్ స్కీమ్ కింద వివిధ భవనాలు నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు. వారికి దేవస్థానం ఈఈలు రామకృష్ణ, వి.నూకరత్నం, ఇతర అధికారులు ఆయా స్థలాలను చూపించి, వివరించారు. దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం నిర్మించనున్నారు. అలాగే, ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్, ప్రకాష్ సదన్ వెనుకన ఉన్న ప్రస్తుత పార్కింగ్ స్థలంలో అటు సత్యగిరికి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో టాయిలెట్ బ్లాకులు నిర్మించనున్నారు. ఈ స్థలాలను పరిశీలించిన టూరిజం అధికారులు వాటి పొడవు, వెడల్పు నమోదు చేసుకున్నారు. ఈ నిర్మాణాలకు ఈ నెల 9న రూ.18.97 కోట్లకు ఒకే ప్యాకేజీగా రీ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఈ నెల 24తో టెండర్ల దరఖాస్తు గడువు ముగియనుంది. నెలాఖరుకు టెండర్లు ఖరారు చేసి, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తారని టూరిజం అధికారులు తెలిపారు. స్థలాల పరిశీలన అనంతరం వారు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావుతో సమావేశమై చర్చించారు. ప్రసాద్ నిర్మాణాలు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో దేవస్థానం డీఈలు గుర్రాజు, బీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment