రుచించని భోజనం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అధ్వానంగా ఉంటోంది. చాలా చోట్ల అన్నం, కూరల్లో నాణ్యత కొరవడింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఊళ్లల్లో అయితే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. కూరలు వండడానికి కూరగాయలు, ఆకు కూరలు నామమాత్రంగా వాడుతున్నారు. కూరలు నీళ్లచారులా ఉంటున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలుతీరుపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. కొన్ని చోట్ల మాత్రమే మెనూ అమలవుతుండగా, చాలా చోట్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో తినడానికి రుచించడం లేదు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు సరిగా బిల్లులు రాకపోవడం, నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు 986 ఉండగా, 73,930 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే చాల బడుల్లో భోజనం నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండడానికి షెడ్‌లు లేకపోవడంతో చాలా చోట్ల చెట్ల కింద కట్టెల పొయ్యిల మీదనే వండుతున్నారు. మరికొన్ని చోట్ల నీళ్లకూ సమస్య ఉంది. ఇళ్ల నుంచే వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బాల మీద దృష్టి పెట్టినట్టే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై కలెక్టర్ దృష్టి సారిస్తే మెరుగయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. సోమవారం అన్నం, కూరగాయల కరీ, ఉడికించిన గుడ్డు ఇవ్వాలి. మంగళవారం అన్నం, ఆకుకూరలతో కూడిన పప్పు, బుధవారం అన్నం, గుడ్డు, కూరగాయల కరీ, గురువారం అన్నం, కూరగాయలతో సాంబార్, శుక్రవారం అన్నం, గుడ్డు, చిక్కుడులతో కూడిన కరీ, శనివారం వెజిటేబుల్ బిర్యానీ లేదా మరేదైనా ఆహారం ఇవ్వాలి. అయితే చాలా స్కూళ్లలో అవసరానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేయడం లేదు. పెరిగిన కూరగాయలు, ఆకుకూరల ధరలతో వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కాదని చెప్పి అరకొరగా తెచ్చి వండుతున్నారు. అలాగే వారినికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, దాదాపు అంతటా రెండు మాత్రమే ఇస్తున్నారు.
మెనూ కాగితాలకే పరిమితం
జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులు
కేటగిరి పాఠశాలలు విద్యార్థులు
ప్రాథమిక 662 29,425
ఉచ్ఛతర ప్రాథమిక 127 9,076
ఉన్నత 197 35,429
మధ్యాహ్న భోజనమే లేదు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోంది. నాసిరకం కూరగాయలు, సరుకులతో వంటలు చేస్తుండటంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. రుచి పచి లేని భోజనం తినలేక అర్ధాకలితో పాఠాలు వింటున్నారు. మరికొందరు
ఇంటి నుంచి భోజనం, కర్రీలు తెచ్చుకుంటున్నారు.
చాలా చోట్ల నీళ్ల చారు..
మెరిగల అన్నం
అరకొరగా ఆకుకూరలు,
కూరగాయల వాడకం
మధ్యాహ్న భోజనం తినడానికి
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
తాడ్వాయి మండలం నందివాడ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నడవక చాలా రోజులైంది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి, జప్తిజాన్కంపల్లి, ఎర్రారం గ్రామాల్లోని యూపీఎస్‌లలో కొంత కాలంగా మధ్యాహ్న భోజనం లేక ఇళ్లకు వెళ్లి భోజనం తిని వస్తున్నారు. జిల్లాలో మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నడవడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో మాత్రం అంతటా కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment