చిన్నారిని మింగిన డ్రైనేజీ
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణం 35వ వార్డు పరిధిలోని రాంనగర్‌లో ఏడు ఫీట్ల లోతైన డ్రైనేజీలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రాంనగర్‌లో నివసిస్తున్న ఆటో డ్రైవర్ మట్ట ప్రశాంత్, జ్యోతి దంపతుల కూతురు ధనశ్రీ గురువారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటూ డ్రైనేజీలో పడిపోయింది. పాప కనపడక పోయేసరికి కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికారు. చివరకు కాలనీవాసులు డ్రైనేజీలో బుడగలు వస్తుండడం గమనించి వెతకగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఉన్నఫలంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పెళ్లయి. 12 సంవత్సరాలకు జన్మించిన ఏకై క సంతానం ధనశ్రీ మృతితో దంపతుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి వచ్చిన మున్సిపల్ అధికారులతో కాలనీవాసులు వాగ్వాదం పెట్టుకున్నారు. కాలనీలో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీపై రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. చిన్నారి మృతికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. డ్రైనేజీ వద్ద వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
టీచర్లు రుచి చూశాకే
పిల్లలకు భోజనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రంలో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలు మొదలు స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో హెడ్మాస్టర్, హాస్టల్‌లో వార్డెన్, అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్, గురుకులాల్లో ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. కమిటీ సభ్యులు తిన్న తర్వాతే పిల్లలకు ఆహారం అందించాలని ఆదేశించింది. ప్రతీ రోజూ వంట చేసే ముందు స్టోర్ రూం, కిచెన్‌లను పరిశీలించాలని పేర్కొంది.
దీక్షా దివస్‌కు
గులాబీ దండు రెడీ!
● నేడు జిల్లా కేంద్రంలో సభ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్షకు కూర్చుని రాష్ట్రాన్ని సాధించిన నేపథ్యాన్ని ఆ పార్టీ దీక్షా దివస్‌గా పేర్కొంటూ శుక్రవారం జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పట్టణంలోని సత్య కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఉద్యమ నేపథ్యానికి సంబంధించి ఫొటోల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీక్షా దివస్ ఇన్‌చార్జీగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్‌సింధే, జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్ తదితరులు హాజరుకానున్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా నేతలు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment