రైతుల వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్ ఎంట్రీలు, రైతులకు చెల్లింపులు తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో గురువారం పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కాంటా పూర్తి కాగానే ధాన్యాన్ని రైస్‌మిల్లలకు తరలించాలన్నారు. ఆ వెంటనే రైతుల, ధాన్యం వివరాలతో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వి విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, ఇన్‌చార్జి డీఎస్‌వో నరసింహారావు పాల్గొన్నారు.
తప్పులు లేకుండా నమోదు చేయాలి
సమగ్ర సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమగ్ర సర్వే డేటా ఎంట్రీపై సమీక్షించారు. సర్వే వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా పర్యవేఓఇంచాలన్నారు. వేగవంతంగా పూర్తి చేసేలా డేటా ఎంట్రీ ఆపరేటర్లను ప్రోత్సహించాలన్నారు. కామారెడ్డి మున్సిపల్‌కు సంబంధించిన డేటా ఎంట్రీ కోసం అవసరమైతే అదనంగా ఆపరేటర్‌లను నియమించుకోవాలన్నారు. సర్వేలో సేకరించిన సమాచారం ఫారాలను భద్రపరచాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ డీఈఈ వేణుగోపాల్, టీపీవో గిరిధర్ పాల్గొన్నారు.
7 నుంచి సీఎం కప్ క్రీడలు
కామారెడ్డి క్రైం: గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో సీఎం కప్– 2024 క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సీఎం కప్ నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి పలు రకాల క్రీడల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 7 నుంచి 8 వరకు గ్రామపంచాయతీ స్థాయి క్రీడలు, 10 నుంచి 12 వరకు మండల, మున్సిపల్ స్థాయి, 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ సింధుశర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment