అక్రమ నిర్మాణాలపై చర్యలు
● మండల ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ ఏర్పాటు
● బొమ్మకల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కరీంనగర్‌రూరల్: అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ, సుడా అనుమతి లేకుండా గ్రామాల్లో చేపట్టిన నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. మండలస్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీస్, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖలతో పాటు సంబంధిత పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా నియమించారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ఏడాది క్రితం బైపాస్‌రోడ్డులోని సర్వేనం.724/డీ స్థలంలో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఐదు రేకులషెడ్లు నిర్మించారు. పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణదారులు పట్టించుకోలేదు. దీంతో పంచాయతీ అధికారులు కలెక్టర్, డీపీవోలకు అక్రమ కట్టడాలపై చర్యల నిమిత్తం నివేదిక పంపించారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి ఉత్వర్వులు జారీ చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం తహసీల్దార్ రాజు ఆధ్వర్యంలో సీఐ ప్రదీప్‌కుమార్, ఎంపీవో జగన్మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హిదైతుల్లా, ఆర్‌అండ్‌బీ, అ గ్నిమాపకశాఖల అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. జేసీబీతో ఐదు రేకులషెడ్లను కూల్చివేయించారు. గ్రామపంచాయతీ, సుడా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే తగిన చర్యలు చేపడుతామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment