లక్ష్యాలపై సింగరేణి దృష్టి
● గడిచిన ఏడు నెలల్లో 90 శాతం బొగ్గు ఉత్పత్తి
● 121 శాతంతో అగ్రగామిగా ఇల్లెందు ఏరియా
గోదావరిఖని(రామగుండం): ఉత్పత్తి లక్ష్యాల సాధనపై యాజమాన్యం భారీ కసరత్తు చేస్తోంది. వర్షాలు వెనకపడటం, ఓసీపీల్లో అనుకూలంగా ఉండటంతో ఈనెల నుంచి బొగ్గు ఉత్పత్తిపై దృష్టిసారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గడిచిన ఏడునెలల్లో లక్ష్యాలకు 90 శాతం చేరువలో ఉండటంతో మిగతా 10 శాతం సాధిస్తూనే నెలవారీ టార్గెట్లపై దృష్టిసారించాలని సంస్థ సీఅండ్‌ఎండీ బలరాం దిశానిర్దేశం చేశారు. శుక్రవారం వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనపై అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, గత ఏడునెలల్లో రెండో త్రైమాసికంలో 37.52 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 33.84 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 90 శాతంలో నిలిచింది. సంస్థలో 17 ఓపెన్‌కాస్ట్ గనులు, 22 భూగర్భ గనులున్నా యి. సంస్థవ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉత్పత్తిలో పోటీ పడుతున్నప్పటికీ రెండు ఏరియాలు లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి సాధించాయి.
ముందంజలో రెండు ఏరియాలు
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో గడిచిన ఐదు నెలల్లో సంస్థ వ్యాప్తంగా రెండు ఏరియాలు అగ్రగామిగా నిలిచాయి. ఇల్లెందు ఏరియా 121శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఆర్జీ–2 ఏరియా 103శాతం ఉత్పత్తి సాధించి రెండో స్థానంలో నిలిచింది. శ్రీరాంపూర్, భూపాల్‌పల్లి ఏరియాలు 71శాతం ఉత్పత్తితో చివరి స్థానంలో నిలిచాయి.
2024–25 టార్గెట్ :
72 మిలియన్ టన్నులు
సెప్టెంబర్ చివరి నాటికి టార్గెట్:
37.52 మిలియన్ టన్నులు
సాధించింది:
33.84 మిలియన్ టన్నులు
సంస్థవ్యాప్తంగా..
ఓసీపీలు: 17
భూగర్భగనులు: 22
సంస్థవ్యాప్తంగా సెప్టెంబర్ చివరినాటికి సాధించిన బొగ్గు ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)
ఏరియా లక్ష్యం సాధించింది శాతం
ఆర్జీ–1 27.52 23.91 87
ఆర్జీ–2 45.29 46.60 103
ఆర్జీ–3 33.64 32.70 97
ఏపీఏ 3.38 3.35 99
భూపాల్‌పల్లి 22.89 16.27 71
కొత్తగూడెం 77.48 73.28 95
ఇల్లెందు 20.09 24.28 121
మణుగూరు 69.81 61.44 88
బెల్లంపల్లి 19.30 16.39 85
మందమర్రి 20.83 15.45 74
శ్రీరాంపూర్ 34.96 24.70 71
రోజూ 2.40 లక్షల టన్నులు..
రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి. అన్ని ఏరియాలు కలిపి రోజూ 2.40లక్షల టన్నుల బొగ్గు వెలికితీసి రవాణా చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత వెనకపడి ఉన్న ఉత్పత్తితో పాటు ప్రతినెలా నిర్దేశించిన లక్షా్యాలను సాధించాలి. యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. మిగిలిన ఐదు నెలల్లో కార్మికుల గైర్హాజరు పూర్తిగా తగ్గించాలి. రక్షణకు సంబంధించిన అధికారులు కొరత లేకుండా చూడాలి.
– ఎన్.బలరాం, సంస్థ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment