హెల్మెట్ మరిచారు!
● గతేడాది రోడ్డు ప్రమాదంలో 102 మంది.. ● ఈ ఏడాది ఇప్పటి వరకు 89 మంది మృతి ● పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోని యువత ● కేసులు పెడుతున్నా మారని వైనం
● గతనెల 11న కరీంనగర్ సిటీలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో సిటీకి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ హెల్మెట్ ధరించలేదు. స్థానికులు సమయానికి హాస్పిటల్‌లో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.
● ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అయి తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలిస్తే మెదడు నరాలు చిట్లిపోయాయని చెప్పారు. కొద్దిసేపటికే ఆయన మృతిచెందాడు. హెల్మెట్ ఉంటే బతికేవాడని డాక్టర్లు పేర్కొన్నారు.
● కొద్ది రోజుల క్రితం నగరంలోని గణేశ్‌నగర్ బైపాస్‌రోడ్డులో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఎగిరిరోడ్డుపై పడగా.. తలకు హెల్మెట్ ధరించి ఉండడంతో కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
అవగాహన కల్పిస్తున్నా...
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నా.. హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నా.. యువతలో మార్పు రావడంలేదు. ద్విచక్ర వాహనదారులు మారడంలేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నా... పట్టించుకోవడంలేదు. మారాలి.. మీ భార్యకోసం.. మీ పిల్లల కోసం.. మీ కుటుంబం కోసం.
విస్మరిస్తున్న జిల్లా ద్విచక్ర వాహనదారులు
రూ.లక్షలు వెచ్చించి రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న వాహనదారులు రూ.వెయ్యి వెచ్చించి ఒక మంచి హెల్మెట్ కొనుగోలు చేయడాన్ని విస్మరిస్తున్నారు. మరికొందరు హెల్మెట్ ఉన్నా వినియోగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. హెల్మెట్ ధరించకపోవడం కారణంగానే 80 శాతం ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు, వైద్యులు హెచ్చరిస్తుండగా కరీంనగర్ జిల్లా వాహనదారులు నిబంధనలకు నీళ్ల్లొదులుతున్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండని అవగాహన కల్పిస్తున్నా.. చలాన్లు విధిస్తున్నా ప్రజల్లో చలనం రావడం లేదు. – కరీంనగర్‌క్రైం
Comments
Please login to add a commentAdd a comment