● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: దేశానికి స్వాతంత్య్రం అందించడంలో కీలకపాత్ర పోషించి దూరదృష్టితో విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి నిర్వహించారు. వారి చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి, మేయర్ వై.సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అబుల్ కలాం ఎప్పుడూ కులమతాలకు అతీతంగా పోరాడారని అన్నారు. తన జీవితాన్ని దేశానికి స్వాతంత్య్రం, విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చేందుకు అంకితం చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా సేవలందించారని, మనం కూడా వారిలాగా నిరంతరం నేర్చుకుంటూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ దేశ తొలి విద్యామంత్రిగా భారతరత్న కలాం రూపొందించిన విద్యావిధానం ఎంతో తోడ్పడిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్, డీఆర్వో బి.వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, డీవైఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment