ఇబ్బందులు లేకుండా జంక్షన్ నిర్మించాలి
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జంక్షన్ నిర్మించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా పద్మనగర్‌లో రూ.65 లక్షలతో నిర్మించతలపెట్టిన జంక్షన్ స్థలాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌లతో కలసి ఆమె సోమవారం పరిశీలించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించిన తరహాలో జంక్షన్ నిర్మాణానికి పద్మనగర్‌లో స్థలసమస్య నెలకొంది. దీంతో ఎంత విస్తీర్ణంలో జంక్షన్‌ను నిర్మించాలనే అంశంపై స్మార్ట్ సిటీ, నగరపాలకసంస్థ, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలెక్టర్ చర్చించారు. అటు బైపాస్ వైపు వెళ్లే వాహనాలు, ఇటు నగరంలోనికి వచ్చే వాహనాలు సులువుగా వెళ్లేలా జంక్షన్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఉన్న స్థలంలోనే అభివృద్ధి చేసేలా జంక్షన్ డిజైన్‌ను స్మార్ట్ సిటీ, నగరపాలకసంస్థ, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా రూపొందించాలని ఆదేశించారు. నగరపాలకసంస్థ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి
Comments
Please login to add a commentAdd a comment