ప్రశాంతంగా గ్రూప్–3
కరీంనగర్ అర్బన్: రెండ్రోజులుగా నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరగగా సోమవారం ఉదయం పేపర్–3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మూడు సెషన్లుగా నిర్వహించిన పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తదుపరి లోనికి అనుమతించారు. 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మొత్తం 26,415 మంది అభ్యర్థులకు గాను 13,902 మంది హాజరుకాగా, 12,513 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 52.63 శాతం మంది పరీక్ష రాశారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలుపరీక్షా కేంద్రాలను తనిఖీచేసి సూచనలు చేశారు. జెడ్పీ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీసు బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. గ్రూప్–3 పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రాల జవాబు పత్రాలకు సీల్ వేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ విజయ్ కుమార్, గ్రూప్–3 పరీక్ష కోఆర్డినేటర్లు వరలక్ష్మి, సతీశ్ కుమార్, సీఐలు కోటేశ్వర్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మడిపల్లి కాళిచరణ్ పర్యవేక్షించారు.
● 52.63 శాతం మంది హాజరు
Comments
Please login to add a commentAdd a comment