సన్నాలు కొంటలేరు
● కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు
● ఆందోళనలో రైతులు
కరీంనగర్‌రూరల్: కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ మండలంలో కేంద్రాలను ప్రారంభించి 20 రోజులవుతున్నప్పటికీ చెర్లభూత్కూర్‌లో మినహా ఎక్కడా కొనుగోళ్లు చేపట్టలేదు. ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు అధిక విస్తీర్ణంలో సన్నవరిని సాగు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు దొడ్డురకం రూ.2,300, ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ. 2,320 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 33 రకాల సన్నగింజ రకాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తామనడంతో జేజీఎల్, కూనారం, జైశ్రీరాం, వరంగల్, ఆర్‌ఎన్‌ఆర్ తదితర రకాలను పండించారు.
చెర్లభూత్కూర్‌లోనే కొనుగోళ్లు
కరీంనగర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో 11, దుర్శేడ్ సింగిల్‌విండో ఆధ్వర్యంలో 6, ఐకేపీ ఆధ్వర్యంలో 3 మొత్తం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే సోమవారం కేవలం చెర్లభూత్కూర్ కేంద్రంలోనే 240 క్వింటాళ్ల సన్న ధాన్యం కొనుగోలు చేశారు. మిగతా కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఏఈవోలు సన్నాలను ధ్రువీకరించిన తర్వాతే నిర్వాహకులు కాంటా పెట్టాలని అధికారులు ఆదేశాలిచ్చినప్పటికీ సంబంధిత కేంద్రాల ఏఈవోలు రాకపోవడంతో కొనుగోళ్లు చేపట్టడం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment