సర్వే వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. నగరంలోని తీగలగుట్టపల్లి, బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే తీరును పరి శీలించారు. నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, బొమ్మకల్ పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా పాల్గొన్నారు.
లీకేజీలను సరిచేయాలి
నగరంలోని వాటర్ పైప్‌లైన్ లీకేజీలను సరిచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. నగరంలో భగత్‌నగర్ రిజర్వాయర్ సమీపంలో లీకేజీని, అంబేడ్కర్‌నగర్ రిజర్వాయర్‌ను మంగళవారం తనిఖీ చేశారు. తాగునీటి సమయవేళల రిజిస్టర్లను పరిశీలించారు. లీకేజీలను సరిచేయాలని, ఎక్కడా తాగునీటి సరఫరా సమయవేళల్లో జాప్యం చోటు చేసుకోరాదని సూచించారు.
‘ఏడాది పాలనలో కాంగ్రెస్ ఉద్ధరించింది ఏమీలేదు’
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఉద్ధరించిందేమీ లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లోని పార్టీ జిల్లాశాఖ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరి గింది. అధ్యక్షత వహించిన కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు.ఏడాది పాలనతో అన్ని వర్గాలవారిని మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక రోజుకో నాటకం ఆడుతున్నారని అన్నారు. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించిందే తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నేతలు బాస సత్యనారాయణరావు, డి.శంకర్, కోమల ఆంజనేయులు, గుగ్గిళ్లపు రమేశ్, ఇనుగొండ నాగేశ్వర్‌రెడ్డి, బూట్ల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ధర్నా
కరీంనగర్: పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల ను విడుదల చేయాలని, నూతన పీఆర్సీని జూలై 2023నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ.. కమ్యూటేషన్ తగ్గింపును 15ఏళ్ల నుంచి 12ఏళ్లకు కుదించాలన్నారు. అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సమర్పించారు. కట్టా నాగభూషణచారి, తిరుమలయ్య, వెంకటయ్య, చంద్రయ్య, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులపై రాజకీయమా?
కరీంనగర్ అర్బన్: ఉద్యోగులపై రాజకీయ వ్యవహారాలను రుద్దడం ఉద్యోగలోకం సహించదని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంతో పాటు హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో ఉద్యోగులపై రాజకీయ నేతల దాడులను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులకు సొంత జెండా.. ఎజెండా ఉండదని, ప్రభు త్వ లక్ష్యమే ఉద్యోగుల పంతమని వివరించారు. దాడులు పునరావృతమైతే పోరాటా లకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, హరికృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment