ముస్తాబవుతున్న కళాభారతీ
● పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులు
కరీంనగర్ కార్పొరేషన్: స్వల్ప మరమ్మతులతో సరిపెట్టాలనుకున్న కళాభారతిని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతికి మరమ్మతులు చేపట్టాలని గత నెలలో కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయించడం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన జరిగిన బాలల దినోత్సవ ఉత్సవాలను కళాభారతిలోనే జరిపించాలనే సంకల్పంతో పనులు చేపట్టారు. సంబంధిత కాంట్రాక్టర్ అనుకున్న రీతిలో పనులు పూర్తి చేయకపోవడంతో కళోత్సవాలకు కళాభారతి అందుబాటులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మరమ్మతులతో సరిపెట్టకుండా, పూర్తిస్థాయిలో ఆధునీకరించే దిశగా పనులు చేపట్టారు.
ఏళ్లుగా నిరుపయెగం
ఉమ్మడి జిల్లాలో కళోత్సవాలు, వివిధ సంఘాల కార్యక్రమాలకు వేదికై న కళాభారతి చాలాఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ఆవరణలో ఆధునిక ఆడిటోరియం నిర్మాణం చేపట్టడంతో కళాభారతి మరుగున పడిపోయింది. కాని ఆ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆడిటోరియం ప్రారంభానికి నోచుకోలేకపోయింది. ఈ క్రమంలో కళాభారతిని మళ్లీ వినియోగంలోకి తేవాలని కలెక్టర్ నిర్ణయించారు. మరమ్మతులకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నెల 14వ తేదీన నాటికి కళాభారతిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం మూలంగా 14వ తేదీ నాటికి సిద్ధం కాలేకపోయింది. దీంతో కాంట్రాక్టర్‌ను మార్చారు. పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. పైన కొత్తగా రేకులు వేయడంతో పాటు, లోపల సీలింగ్ చేశారు. కుర్చీలకు మరమ్మతులు చేయడంతో పాటు, ముందు వరుసలో కొత్తగా ప్రత్యేక సీట్లు అమర్చుతున్నారు. మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి చేశారు. రంగులు వేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోగా పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
పనులు పరిశీలించిన కలెక్టర్
కళాభారతి ఆధునీకరణ పనులను మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు పనులను, వేదికను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకుల సీట్ల సంఖ్య, ఏర్పాటు చేయబోయే వివిధ సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు సంబంధించి నగరపాలకసంస్థ డీఈ యాదగిరికి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment