విశ్వసనీయతే పెట్టుబడి
గోదావరిఖని: వినియోగదారుల విశ్వసనీయతకు సింగరేణి పెద్దపీట వేస్తోంది. కోలిండియాలోని వివిధ బొగ్గు గనుల సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా.. సింగరేణి బొగ్గుకే మంచి డిమాండ్ పలుకుతోంది. దేశవ్యాప్తంగా అనేక విద్యుత్, సిమెంట్, ఫార్మా, ఐరన్ కంపెనీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. ఒప్పంద సమయంలోని నిబంధలన ప్రకారం నాణ్యతలో రాజీ పడడంలేదు. మాటకు కట్టుబడి వినియోగదారుల విశ్వసనీయత పెంచుకుంటోంది. ఏటా బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తోంది.
‘మహారత్నాల’కు దీటుగా..
మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తోంది. ఏటా సుమారు 70 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తూనే.. కస్టమర్లకు విక్రయిస్తోంది. బొగ్గు నాణ్యతపై రాజీలేకుండా ముందుకు సాగుతోంది. దీంతో సింగరేణి బొగ్గు కొనుగోలుకు మార్కెట్‌లో కస్టమర్లు పోటీ పడుతున్నారు. రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గును రావాణా చేస్తోంది. ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు అధికంగా సరఫరా చేస్తోంది. ఉత్పతికి అనుగుణంగా డిమాండ్ కూడా ఉంటోంది. ప్రధానంగా సింగరేణి జీ–5, 7, 8, 10, 11 గ్రేడ్ బొగ్గును అధికంగా అమ్ముతోంది.
వివిధ సంస్థలకు సరఫరా
సింగరేణి సంస్థ 14 సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తోంది. నాన్‌పవర్ సెక్టార్‌లో ఐటీసీ భద్రాచలం, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్, ఏసీసీ వాడి, కేశోరాం సిమెంట్ పరిశ్రమకు బొగ్గు విక్రయిస్తోంది. అలాగే పవర్ సెక్టార్‌లో బీటీపీఎస్ మణుగూరు, కేటీపీఎస్ పాల్వంచ, కేటీపీపీ భూపాలపల్లి, మహా జెన్‌కో చంద్రపూర్, ఎన్టీపీసీ రామగుండం, వీటీపీఎస్ విజయవాడ, బీటీపీఎస్, వైటీపీఎస్, ఆర్‌టీపీఎస్ రాయచూర్, టంగెడ్‌కో సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తోంది.
నాణ్యతకు పెద్దపీట..
వినియోగదారుల విశ్వసనీయతను కాపాడుకునేందుకు సింగరేణి క్వాలిటీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ స్థాయిలో జీఎంతోపాటు రామగుండం, బెల్లంపల్లి, కొత్తగూడెం రీజియన్లలో జీఎంలను నియమించింది. ఏరియాల స్థాయిలో ప్రత్యేక విభాగం నాణ్యతపై డేగకన్ను వేస్తోంది.
బొగ్గు నాణ్యత నిర్ధారణ ఇలా..
బొగ్గు నాణ్యత పరీక్షలకు సింగరేణి గతంలో ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సిమ్‌టార్‌కు కేటాయించేది. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఆమోదించిన ఐదు ప్రైవేట్ ఏజెన్సీలకు బొగ్గు నాణ్యత పరీక్షల బాధ్యత అప్పగించింది. బొగ్గు కొనుగోలు చేసే సంస్థ తనకు నచ్చిన ఏజెన్సీని ఎంపిక చేసుకుని బొగ్గు నాణ్యత పరీక్షించుకునే వీలుంది. సింగరేణి ద్వారా ప్రతీరోజు సీహెచీపీలో నాణ్యత పరీక్ష కొనసాగుతోంది. బెల్ట్‌పై వస్తున్న బొగ్గు శాంపిల్ సేకరించి పొడిగా తయారు చేసి భద్రపరుస్తోంది. ఇలా రెండు పరీక్షలు నిర్వహించినా నాణ్యత ఒకేవిధంగా తేలుతోంది. క్వాలిటీ తగ్గితే కొనుగోలుదారు టన్ను ధరపై పోరాటం చేసే అవకాశం ఉంటుంది. వాస్తవంగా క్వాలిటీ తగ్గినట్లు నిరూపిస్తే చెల్లించిన డబ్బులు అదే క్వాలిటీ ప్రకారం తీసుకుని మిగతా డబ్బు వినియోగదారునికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే సేకరించి బొగ్గును ప్రతీరోజు ప్రైవేట్ ఏజెన్సీ ల్యాబ్‌కు పంపిస్తుంది. అందులో ఒక శాంపిల్ బయోమెట్రిక్ లాక్ ద్వారా లాకర్ భద్రపరుస్తారు. క్వాలిటీలో తేడా వస్తే లాకర్‌లోని శాంపిల్‌ను పరీక్షించేందుకు వీలుంటుంది.
నేడు ముగింపు వేడుకలు
బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఈనెల 14న ప్రారంభమయ్యాయి. ఈనె 20న ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా బుధవారం గోదావరిఖని ఇల్లెందు క్లబ్‌లో క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తారు.
వినియోగదారులపై అత్యంత నమ్మకం
బొగ్గు నాణ్యతపై సింగరేణి ప్రత్యేక దృష్టి
నేడు ముగింపు వేడుకలకు ఏర్పాట్లు
నాణ్యతను బట్టి బొగ్గు
ధరలు(టన్నుకు రూ.లలో)
గ్రేడ్(జి) ధర
1 6,510
2 6,300
3 6,210
4 6,160
5 5,685
6 5,230
7 4,830
8 3,830
9 3,150
10 3,010
11 2,520
నాణ్యతపై రాజీలేదు
ఉత్పత్తిలో నాణ్యత తగ్గితే విశ్వసనీయత సన్నగిల్లుతుంది. బొగ్గు నాణ్యత విషయంలో రాజీలేకుండా ముందుకు సాగుతున్నాం. కొత్తగూడెంతోపాటు మూడు రీజియన్లలో క్వాలిటీ జీఎంలను నియమించాం. థర్మల్, సిమెంట్, ఐరన్, ఫార్మా కంపెనీలకు అధికంగా బొగ్గు విక్రయిస్తున్నాం.
– బలరాం, సింగరేణి సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment