‘పాడి’.. రాజకీయ వేడి
● హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి కేసు.. ● సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రణాళిక సమీక్షా సమావేశం రాజకీయ వేడికి కారణమైంది. బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గొడ వ విషయంలో అదేరోజు రాత్రి కౌశిక్‌రెడ్డిపై వన్‌టౌన్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. తమ ఎమ్మెల్యేను పరుష పదజాలంతో దూషించి, ఆయనపై దాడికి పాల్పడ్డారని, అడ్డుకోబోయిన తనను కూడా తోసేశారని సంజయ్ పీఏ వినోద్ మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్‌ఎస్ 132, 115(2), 353, 292 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎమ్మెల్యే కౌశిక్‌పై మరో 2 కేసులు నమోదయ్యాయి. ఏసీపీ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్‌లోని ఓ టీవీ స్టూడియో ఎదుట ఆయనను అరెస్టు చేసి, కరీంనగర్ తీసుకొచ్చారు.
భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదానికి దిగడం, నెట్టివేయడం, దూషణలకు దిగడంతో ఆయనపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం సంజయ్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షలకు పంపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు కౌశిక్‌రెడ్డి తీరును ఖండిస్తూ ఆయన చిత్రపటాన్ని గాడిదకు అంటించి, నిరసన తెలిపారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి ప్రణవ్ కూడా పాడి తీరును తప్పుబట్టారు.
శాసనసభ సభ్యత్వం రద్దుకు పట్టు..
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లు విసిరిన మైకు అప్పటి మండలి స్పీకర్ స్వామిగౌడ్‌కు తగిలిందన్న కారణంతో వారి సభ్యత్వం రద్దు చేశారు. పాడి కౌశిక్ సైతం తోటి ఎమ్మెల్యేపై దాడి చేసి, గాయపరిచారని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సోమవారం ఈ విషయం స్పీకర్ వద్దకు చేరడంతో పాడి సభ్యత్వం రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment