కరీంనగర్‌క్రైం: నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడంతో మృతిచెందగా, అతడి భార్య కరీంనగర్ టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు.. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన మాదరి అశోక్ (58) కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా పని చేస్తుండగా, అతడి భార్య సుజాత సిద్దిపేట కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తోంది. ఈనెల 10న అర్ధరాత్రి అశోక్‌కు ఒంట్లో బాగలేకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి వైద్యులు పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని మందులు ఇచ్చి 12వ తేదీన ఇంటికి పంపించారు. సోమవారం మరోసారి అశోక్ అనారోగ్యానికి గురికావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతోనే తన భర్త మృతి చెందాడని పేర్కొంటూ మృతుడి భార్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అశోక్ పూర్తిగా వైద్యం తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయాడని, అతడి మృతిపై పలువురు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment