కౌశిక్‌రెడ్డిని ఎగదోసి శిఖండి రాజకీయం
● కేసీఆర్, కేటీఆర్‌లపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ ● దమ్ముంటే తెలంగాణ చౌక్‌కు రావాలని ‘పాడి’కి సవాల్
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో పాడి కౌశిక్‌రెడ్డి అనే సైకోను ఎగదోసి, కేసీఆర్, కేటీఆర్‌లు శిఖండి రాజకీయం చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. ప్రవర్తన మార్చుకోకపోతే బీఆర్‌ఎస్ కార్యాలయాల్లోకి వచ్చి, కొట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సోమవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రజా ప్రభుత్వం చేపడుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను పేద ప్రజలకు అందించే సదుద్దేశంతో నిర్వహించిన సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కావాలనే పిచ్చిపట్టినట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు 60 మంది టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, చివరకు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రలోభాలకు గురిచేసి, బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై కౌశిక్‌రెడ్డి ప్రశ్నించాల్సింది కేసీఆర్‌నని, ధర్నా చేయాల్సింది బీఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట అన్నారు. కౌశిక్‌రెడ్డికి దమ్ముంటే కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌కు రావాలని, ఎవరు ఎవరిని తిరగనీయరో తెలుస్తుందని సవాల్ విసిరారు. తాము దృష్టి పెడితే కౌశిక్ ఇంటి గడప కూడా దాటలేడన్నారు. అతని లాంటి సైకోలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నియంత్రించకపోతే, బీఆర్‌ఎస్ నాయకులెవరూ రోడ్డు మీద తిరగరని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డి తన ప్రవర్తనపై కలెక్టరేట్ వద్ద ముక్కు నేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతని వ్యవహారంపై డీజీపీ, సీపీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment