గౌరవెల్లి ప్రాజెక్టుపై ఫోకస్
● కుడి కాలువ పరిధిలో 61 కి.మీ. మేర కెనాళ్లు నిర్మించాలి ● చిగురుమామిడి మండలంలో 300 ఎకరాల భూమి అవసరం ● 96 ఎకరాలకు డిక్లరేషన్ ● మిగతా భూమికి అవార్డు ఎంకై ్వరీ చేయాలి ● రైతుల సానుకూలత ● వారంలో అన్ని అనుమతులు వస్తాయని అధికారుల ధీమా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
గౌరవెల్లి ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణం మెల్లిగా ఊపందుకుంటోంది. దీని కుడి కాలువ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ–4 కెనాల్ కింద పలు కాలువల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోనే 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వాస్తవానికి 2017–18 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్లో 35 ఎకరాల వరకు భూ సేకరణ పూర్తయింది. అప్పటినుంచి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల కాలువల నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు తిరిగి దృష్టి సారించారు. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి.. కాలువల నిర్మాణ పనులు ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు.
61 కిలోమీటర్ల పొడవు..
డిస్ట్రిబ్యూటరీ కెనాల్–4 చిగురుమామిడి మండలంలోని 9 గ్రామాల మీదుగా వెళ్లనుంది. గౌరవెల్లి ప్రా జెక్టు ద్వారా 15 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. 2 నెలలుగా గ్రామాల్లో కెనాల్ తవ్వకాల కోసం సర్వేలు, గ్రామసభలు నిర్వహిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గానూ ఇదివరకే తోటపెల్లి రిజర్వాయర్ నుంచి ముదిమాణిక్యం, రామంచ, చిన్నముల్కనూర్, పీచుపల్లి, సీతారాంపూర్‌లో కొంత భాగం, రేకొండ, ఇందుర్తిలో కొంత భాగం సాగు నీరందుతోంది. మిగిలిన గ్రామాలైన ఇందుర్తి, నవాబుపేట్, కొండాపూర్, గాగిరెడ్డిపల్లి, లంబాడిపల్లి, చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లిలకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నీరందించాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ–4 కింద మైనర్, సబ్ మైనర్ కెనాల్స్ అన్నీ కలిపి, 61 కిలోమీటర్ల మేర తవ్వనున్నారు. మైనర్ ఇరిగేషన్ 13వ మైలురాయి నుంచి 30వ మైలురాయి వరకు డిస్ట్రిబ్యూటరీ కెనా ల్‌ను 40–50 మీటర్ల వెడల్పుతో తవ్వనున్నారు. కెనాల్‌కు ఇరువైపులా 10 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మించనున్నారు. రైతులు తమ పంట పొలాల వద్దకు వెళ్లేందుకు, అలాగే కెనాల్‌ను పరిశీలించేందుకు, అవసరమైతే మరమ్మతులు చేయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మైనర్ కెనాల్స్‌ను 14– 28 మీటర్ల వెడల్పుతో, సబ్ మైనర్ కెనా ల్స్‌ను 8– 12 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. కాలువ 16.86 కి.మీ. కొండాపూర్‌లో మొదలై ఇందుర్తి గ్రామంలోని 26.500 కి.మీ. వద్ద ముగియనుంది.
ఇంకా నిర్ణయం కాని పరిహారం..
కెనాల్ తవ్వకం కోసం 265 ఎకరాల భూ సేకరణ చేస్తున్నారు. 250 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో 96 ఎకరాలకు డిక్లరేషన్ ఇవ్వడం కూడా అయిపోయింది. మిగతా భూమికి అవార్డు ఎంకై ్వరీ చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. సాగునీటి కెనాల్ కింద 300 ఎకరాలు అవసరం కాగా.. ఎకరానికి ఎంత పరిహారం ఇస్తారో ఇంకా నిర్ణయించలేదని, కాస్త సమయం పడుతుందని చిగురుమామిడి మండల ఇరిగేషన్ ఏఈ రాకేశ్‌రెడ్డి తెలిపారు. కాలువల నిర్మాణానికి ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రాలేదని.. రైతులందరూ స్వాగతిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీంతో మిగిలిన భూమికి సంబంధించి ఈ వారంలో అన్ని రకాల అనుమతులు రానున్నాయని ధీమాగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment