కుల బహిష్కరణ చేశారని ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన దొందరి గంగారాం, ఒర్రె సాయవ్వ, జక్కుల శారద, బైరి రాధ తమను కుల బహిష్కరణ చేశారని ఎస్పీ అశోక్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గొల్లకుర్మలు ఏటా సంక్రాంతి, ఉగాది పండుగలకు బోనాలు తీస్తారు. సంక్రాంతి సందర్భంగా తీసే బోనాలకు తమ కుటుంబాలకు సమాచారం అందించలేదని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామస్తుల సమక్షంలో కులస్తులను అడిగితే తమను కులం నుంచి బహిష్కరించామన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండుచోట్ల అగ్ని ప్రమాదాలు
కరీంనగర్‌క్రైం: నగరంలో రెండు చోట్ల సోమవారం వేకుజామున అగ్నిప్రమాదాలు జరిగాయి. అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్– పెద్దపల్లి బైపాస్‌లోని సోహెల్ దాబా పక్కన గుర్తు తెలియని వ్యక్తులు మంటకాగడంతో అగ్నికీలలు దాబాపై పడి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. సుమారుగా రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మంచిర్యాల చౌరస్తాలోని ఒక టింబర్ డిపోలో స్వల్పంగా కర్రలు కాలిపోయాయని ఫైర్ అధికారులు తెలిపారు.
ముస్తఫానగర్ శివారులో చిరుత సంచారం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని ముస్తఫానగర్ శివారులో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన రాసమల్ల రాజు పొలం వద్ద గుడిసెలో కట్టేసిన గేదైపె చిరుత దాడి చేసింది. గేదె కళేబరాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పనాదేవి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అంజలి, ఫారెస్ట్ అధికారి రమేశ్ రైతులతో మాట్లాడారు. గేదైపె పులి దాడిచేసిన నేపథ్యంలో ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని, పంట పొలాల్లో పశువులను కట్టివేయవద్దని, ఇంటికి తెచ్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment