లింకు నొక్కారో.. ఖాతా ఖాళీనే
● ఆన్‌లైన్ ప్రకటనలకు ఆకర్షితులవుతున్న పలువురు ● అకౌంట్‌లో డబ్బులు పోయాక లబోదిబో ● కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన సైబర్ క్రైం కేసులు ● సవాల్‌గా తీసుకున్న పోలీసులు ● ప్రత్యేక సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ● సైబర్ వారియర్లతో ప్రతీ ఠాణాలో సేవలు ● ఆన్‌లైన్ యాప్‌లతో జాగ్రత్త అంటూ సూచన
కరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్ల వలలో అమాయక ప్రజలు చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఈ కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. వాట్సాఫ్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనలు కలిగిన లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు చెప్పడం వల్లే బాధితుల అకౌంట్లలో డబ్బులు క్షణాల్లో మాయమవుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరిట వస్తున్న ప్రకటనలు, ఫోన్‌లకు అమాయకులు ఆకర్షితులవుతూ అపరిచితుల అకౌంట్లలోకి డబ్బులు పంపిస్తున్నారని చెబుతున్నారు. మొదట అవతలి వ్యక్తులు బాగానే స్పందించి, తిరిగి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాక మొహం చాటేస్తున్నారని పేర్కొంటున్నారు. మిగతా కేసులతో పోల్చితే సైబర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల కట్టడికి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది నేరాలు పెరగొద్దని భావించి, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
రూ.9.87 కోట్లు.. పుట్ ఆన్ హోల్డ్
గతేడాదితో పోల్చితే సైబర్ నేరాలపై ఫిర్యాదుల సంఖ్య బాగా పెరిగింది. 2023లో 1,654 ఫిర్యాదులు రాగా, 2024లో 2,282 వచ్చాయి. కమిషనరేట్ వ్యాప్తంగా 2023లో ఆర్థిక సైబర్ నేరాలపై 258 కేసులు, 2024లో 270 కేసులు నమోదయ్యాయి. అయితే, 2023లో ఆర్థిక నేరాలకు సంబంధించి 114 కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.1.74 కోట్లను ఫుట్ ఆన్ హోల్డ్‌లో ఉంచారు. 2024కు సంబంధించి 233 కేసుల్లో రూ.9.87 కోట్లు పుట్ ఆన్ హోల్డ్‌లో ఉంచగలిగారు. కోర్టు ఉత్తర్వులతో 2024లో రూ.2.57 కోట్లు, 2023లో రూ.66 లక్షలు అందించారు.
సైబర్ వారియర్ల నియామకం
సైబర్ కేసుల పరిష్కారానికి కరీంనగర్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల కట్టడికి పోలీస్‌స్టేషన్ల వారీగా సైబర్ వారియర్లను నియమించారు. సంబంధిత ఠాణా పరిధిలో నేరం జరిగిందని తెలిసిన వెంటనే వారు స్పందించి, బాధితులకు సహకరిస్తారు. 1930కి, ఎన్‌సీఆర్‌బీ పోర్టల్‌కు సమాచారం అందించి, అక్‌నాలెడ్జ్ పొంది, పోగొట్టుకున్న సొత్తును తిరిగి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ స్థాయిలో సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైం కంట్రోల్ సెల్ ఏర్పాటు చేశారు.
గొలుసుకట్టు వ్యాపారాలతో ఎర
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని, విలాసవంతమైన వస్తువులు ఇస్తామని, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని ఆశ పెడుతూ నిలువునా ముంచే గొలుసుకట్టు మోసాలు జరుగుతున్నాయి. మొదట కొందరు అందులో చేరి, వారికింద పలువురిని జాయిన్ చేస్తే కమీషన్ ఇస్తుండటంతో ఆశతో చాలామంది ఈ ట్రాప్‌లో పడుతున్నారు. గొలుసుకట్టు వ్యాపారాలు ఆ తర్వాత దుకాణం బంద్ చేస్తున్నాయి. పిరమిడ్ మోసాలతోపాటు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పథకాలతో అధిక మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ సూచనలు పాటించండి..
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
మొబైల్ ఫోన్‌కు వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయొద్దు.
తెలియని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరవద్దు.
అపరిచితుల మోసపూరిత మాటలు విని, పూర్తి వివరాలు తెలియకుండానే ఎవరికీ డబ్బులు పంపొద్దు. ఇలా పంపిన సొమ్మును అవతలి వ్యక్తి దేశద్రోహ పనులకు వాడే ప్రమాదం ఉంది.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట అధిక లాభాలు వస్తాయని చెప్పే బోగస్ కంపెనీల మాటలు నమ్మొద్దు. సమావేశాలకు వెళ్లొద్దు.
కష్టపడకుండానే లగ్జరీ కార్లు, భూములు, ఫ్లాట్లు, టూర్లు ఆఫర్ చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేయడానికే అని గుర్తించుకోవాలి.
మల్టీలెవెల్ మార్కెటింగ్‌లో అసలు సూత్రధారులు విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వారితో సంబంధాలు పెట్టుకున్నా, అటువంటి వ్యాపారాల్లో పాలుపంచుకున్నా జైలుకు వెళ్లాల్సి వస్తుందని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
సైబర్ నేరాలు పెరుగుతున్నా యి. ఆన్‌లైన్‌లో అనధికారిక యాప్‌లు, ప్లాట్‌ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్, వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా వచ్చే సందేశాలు లేదా లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల సూచనలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –నర్సింహారెడ్డి,
సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment