ఆడపిల్లలను ప్రోత్సహించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికలను సమాజంలో ఎదగనివ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆడపిల్ల లను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. భేటీ బచావో భేటీ పడావో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల రక్షణకు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. బాలిక విద్యను ప్రోత్సహించాలని, సమాజంలో ఎదిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమాధికారి కె.సబిత, డీసీపీవో పర్వీన్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, కోఆర్డినేటర్లు శ్రీలత, సంపత్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, డిపో మేనేజర్లు విజయ మాధురి, మల్లయ్య పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచండి
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, దీనివల్ల ఎయిడ్స్ బాధితులకు సకాలంలో ఏఆర్‌టీ మందులు ఇవ్వొచ్చని డీఎంహెచ్‌వో కె.వెంకటరమణ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమావేశమై, మాట్లాడారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్లలో హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులు వాడాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1097ను ఫోన్ చేసి, హెచ్‌ఐవీకి సంబంధించిన సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లా అదనపు డీఎంహెచ్‌వో ఎం.సుధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు కె.సురేందర్ రెడ్డి, అవినాశ్‌కుమార్, టి.కృష్ణమూర్తి, పీపీటీసీటీ, డీఎస్‌ఆర్‌సీ, ఏఆర్‌టీ కేంద్రాల కౌన్సిలర్లు, డేటా మేనేజర్లు, ఎన్‌జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
హుజూరాబాద్ : సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బంది కృషిచేయాలని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేసి సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అసంక్రమిత వ్యాధులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని కోరారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్, పంజాల ప్రతాప్, వైద్యాధికారి డాక్టర్ మధు ,సిబ్బంది, తదితరులు ఉన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,250
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ పత్తి రూ. 7,250 పలికింది. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment