పోలీసుల క్రీడా సంరంభం
● నేటి నుంచి కరీంనగర్లో రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్స్ట్ అండ్ గేమ్స్ ● 20 జోన్ల నుంచి హాజరుకానున్న 2,500 మంది క్రీడాకారులు ● పోటీలను ప్రారంభించనున్న ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్‌క్రైం:
మూడో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడాపోటీలు మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కరీంనగర్ పోలీస్ క్రీడామైదానంలో జరగనున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 పోలీస్ జోన్ల నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని 12 వేదికలపై 29 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించేందుకు సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో జరిగే పోటీలను ఇంటెలిజెన్స్ డీజీపీ జి.శివధర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని సీటీసీ, హెడ్ క్వార్టర్స్, అంబేడ్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, సీపీటీసీ, కరీంనగర్ క్లబ్, జీఎస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా తదితర పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళం..
స్పోర్ట్స్ మీట్ కోసం కమిషనరేట్, అంబేడ్కర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ముందస్తు అనుమతితో ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేదీన అనుమతి కోసం పోలీసుశాఖ దరఖాస్తు చేసుకుంది. ఇందులో భాగంగా పోలీసులు వేడుకకు వచ్చేవారి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం మంచాలు, బెడ్లువేసి వెళ్లిపోయారు. తీర సాయంత్రం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళంవేసి ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. వాస్తవానికి ఇటీవలే ప్రారంభించిన సదరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. దాన్ని అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. వెంటనే విషయాన్ని కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయానికి చేరవేశారు. దీంతో డీజీపీ జితేందర్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కదిద్దారని సమాచారం. అయినా.. సోమవారం అర్ధరాత్రి వరకూ.. తాళాలు అలాగే వేసి ఉండటంతో ఈవెంట్‌కు వచ్చే అతిథులు ఎక్కడ ఉంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల మూడో తేదీ నుంచి ఇదే పనుల్లో తలమునకలైన పోలీసులు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళం వేసి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కరీంనగర్‌కు ప్రతిష్టాత్మకం
క్రీడావేడుకకు కలిగిన ఆటంకాలపై నేనేం మాట్లాడను. నాకు పనే ముఖ్యం. కరీంనగర్ జిల్లాకు ఈ వేడుక ప్రతిష్టాత్మకం. సుమారు 2,200 మంది పోలీసులు హాజరవుతున్న ఈ క్రీడాపండుగలో 27 క్రీడా అంశాలలో పోటీలు జరుగుతున్నాయి. పదేండ్లుగా జరగని ఈ క్రీడాపండుగకు ఈసారి కరీంనగర్ వేదిక కావడం సంతోషకరం. దీన్ని విజయవంతం చేస్తాం. – సీపీ అభిషేక్ మహంతి
Comments
Please login to add a commentAdd a comment