పూల‘బత్తి’
కలెక్టర్ పమేలా సత్పతికి అగరుబత్తుల ప్యాకెట్‌ను అందిస్తున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా(ఫైల్)
కరీంనగర్‌క్రైం: వివిధ ఆలయాల్లో పూజకు వినియోగించిన పుష్పాలతో అగరుబత్తీలు తయారు చేసే సరికొత్త ఒరవడికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వాడిన పూలతో అగరబత్తులు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించింది. మొదట ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా జైలులో ప్రారంభించారు. ఇప్పటికే విద్యాసంస్థలకు బెంచీలు, డెస్క్‌లు, షాంపులు, సబ్బులు, ఫినాయిల్, ఇంట్లో ఉపయోగపడే వస్తు సామగ్రి, తదితర వస్తువులను జైళ్ల శాఖ ఖైదీలతో తయారు చేయిస్తుంది. కరీంనగర్‌తో పాటు అన్ని జైళ్లలో వస్తువుల తయారీతో పాటు పెట్రోల్‌బంక్‌లు నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి చూపించడంతో పాటు ఆదాయం సమకూర్చుకుంటుంది. మార్కెట్‌లో లభించే వస్తువులతో పోల్చితే తక్కువ ధర ఉండడం, నాణ్యత పాటించడంతో జైళ్లలో తయారైన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.
రసాయనాలు లేకుండా..
జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులలో రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో చాలా మంది వాడుతున్నారు. అగరుబత్తులు కూడా రసాయనాలు, ఇతరత్రా ఏమీ కలపకుండా ఆలయాల్లో పూజకు వినియోగించిన పూలను సేకరించి వాటితో తయారు చేస్తున్నారు. వాడిన పూలను ఎండబెట్టి, పొడి చేసి వాటితో సహజమైన పదార్థాలు కలిపి అగరబత్తులు తయారు చేస్తున్నారు. ఆలయాల నుంచి పూల సేకరణకు దేవాదాయశాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్ జైలు సందర్శనకు వచ్చిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా అగరుబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతికి జైలులో తయారైన అగరుబత్తులు అందజేశారు. వీటిని మార్కెట్‌లో ప్రవేశపెట్టడంతో పాటు ఇతర జైళ్లలోనూ అగరుబత్తుల తయారీ కేంద్రాలు ప్రారంభిస్తామని, వీటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్యాకెట్ ధర రూ.50..
జైలులో తయారు చేస్తున్న అగరుబత్తుల తయారీకి వాడిన పూలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. అత్తుక్కోవడానికి యారయార పౌడర్, మండడానికి రాళం పొడి(కర్పూరం పొడి), చెక్కపొడి, పూలను ఎండబెటి పౌడర్ కలుపుతున్నారు. ఖైదీలతో మ్యానువల్ మిషన్ ద్వారా రోజుకు 2,500 నుంచి 3,000 వరకు అగరుబత్తులు తయారు చేయిస్తున్నారు. భవిష్యత్‌లో ఆర్డర్లు పెరిగితే ఆటోమేషన్ మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని జైళ్లశాఖ భావిస్తుంది. జైలుతో తయారు చేసే ప్యాకెట్‌లో 65 నుంచి 70 అగరుబత్తులు ఉంటుండగా, ప్యాకెట్ ధర రూ.50 ఉంటుంది.
సహజసిద్ధంగా..
రాష్ట్రంలోనే మొదటగా కరీంనగర్ జైలులో వాడిన పూలతో అగరుబత్తులు తయారీ జరుగుతుంది. స్థానిక ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన వాడిపోయిన పూలను సేకరించి ఎండబెట్టి, సహజ సిద్ధమైన పదార్థాలు కలుపుతూ అగర్‌బత్తులు తయారు చేస్తుండడంతో ఆధరణ లభిస్తుంది.
– శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment