ఓ కార్యక్రమంలో ఎంపీ సుమలత
మండ్య: ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మనకు, మన దేశానికి ప్రధానిగా ఉండడం మన సౌభాగ్యమని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చెప్పారు. మండ్య బీజేపీ టికెట్ లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. బుధవారం మండ్యలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ మండ్య ప్రజల కోసం నిరంతరం పాటుబడ్డానని అన్నారు. మండ్య బీజేపీ టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, అందువల్ల ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఒకవేళ జేడీఎస్‌తో పొత్తు వల్ల మండ్య బీజేపీ టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీలో ఉంటానని తెలిపారు. కన్నడిగుల స్వాభిమానాన్ని చాటిన కదంబ చక్రవర్తి మయూర వర్మ, ఇమ్మడి పులకేశి విగ్రహాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అత్త పోవాలని కోడలి మొక్కు
యశవంతపుర: అత్తా కోడళ్ల మధ్య గొడవలు లేని ఇల్లంటూ ఉండదు. కానీ ఓ కోడలి కసి చాలా తీవ్రంగా ఉంది. మా అత్త తొందరగా పరలోకం చేరాలని కోడలు యాభై రూపాయల నోటుపై రాసి హుండీలో వేసింది. ఉత్తర కన్నడ జిల్లా గాణగాపుర దత్తాత్రేయ దేవస్థానంలో బుధవారం హుండీ డబ్బులను లెక్కిస్తుండగా ఆ నోటు లభించింది. మా అత్త తొందరగా చావాలంటూ రాసి ఉంది. ఆలయ సిబ్బంది నోటుని ఫోటో తీసి జన మాధ్యమంలో ఉంచారు. అత్తపై కోడలికి అంత కోపం ఎందుకు ఉందో.. అని నెటిజన్లు స్పందించారు.
పేలుడు నిందితుడు ఇతడే
● జాడ చెబితే రూ.10 లక్షల కానుక
బనశంకరి: సిలికాన్ సిటీలో వైట్‌ఫీల్డ్ కుందలహళ్లిలోని రామేశ్వరం కెఫెలో ఈ నెల 1న జరిగిన బాంబుపేలుడు కేసులో ఎన్‌ఐఏ బుధవారం నిందితుని ఫోటోను విడుదల చేసింది. ఇతని ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు బహుమానం ఇస్తామని ప్రకటించింది. కెఫెలో బాంబు పేలుడుకు పాల్పడ్డాడని, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అని తెలిపింది. ఇతడి జాడ తెలిస్తే 080–29510900, 8904241100 నంబర్లకు కాల్ చేసి చెప్పవచ్చని, వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని తెలిపింది. కెఫెలో బాంబు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. అతడు దొరికితే తప్ప కేసు ముందుకు సాగదు. దీంతో ప్రజల సహకారం కోరారు.
లంచగొండి ఆర్‌ఐ పట్టివేత
శివమొగ్గ: ఒక మహిళ నుంచి రూ. 40 వేల లంచం తీసుకుంటూ జిల్లాలోని సొరభ పురసభ రెవెన్యూ శాఖ ఇన్స్‌పెక్టర్ వినాయక్ లోకాయుక్తకు పట్టుబడ్డారు. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నవారకు చెందిన ఎం. ప్రతిభా నాయక్ అనే మహిళకు సొరభ తాలూకాలోని హళె సొరబ గ్రామంలో ఖాళీ స్థలం ఉంది. అది పురసభ పరిధిలో ఉంది. స్థలానికి పురసభలో ఖాతా, ఇ– స్వత్తు చేయించింది. అయితే సిబ్బంది తక్కువ విస్తీర్ణాన్ని నమోదు చేయడంతో ఆమె దానిని సవరించాలని గత నెలలో ఆర్‌ఐ వినాయక్‌కు అర్జీ ఇచ్చింది. ఆయన రూ.50 వేలు ముడుపులు అవసరమని సూచించాడు. దాంతో ఆమె శివమొగ్గ లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేసింది. బుధవారం ఆఫీసులో రూ. 40 వేలు తీసుకుంటూ వినాయక్ దొరికిపోయాడు. డబ్బును సీజ్ చేసి, అతనిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
త్వరలోనే బీజేపీ
అభ్యర్థుల జాబితా
దొడ్డబళ్లాపురం: రెండు మూడు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో కొందరు ప్రస్తుత ఎంపీలకు టికెట్ దక్కదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి కొందరు కొత్తవారికి అవకాశం కల్పించవచ్చని సమాచారం. మొదట 20 ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే ఉన్నతస్థాయి భేటీ తరువాత జాబితా విడుదల ఉండవచ్చు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటకలో బీజేపీకి 25 మంది ఎంపీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment