భక్తిశ్రద్ధలతో వెలుగుల దీపావళి
సాక్షి బళ్లారి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే దీపావళి వేడుకలను ఘనంగా గురువారం నగరంలో పెద్ద ఎత్తున బాణసంచాలను పేల్చుతూ ఇంటింటా దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బాణసంచాను పేల్చుతూ ఇంటి ముందు మట్టితో తయారు చేసిన ప్రమిదలను వెలిగించారు. బాణసంచాకు మంచి డిమాండ్ ఏర్పడింది. బాణసంచా అమ్మకాలను ఒకే స్థంలోనే అమ్మకాలు చేయడంతో నగర వాసులు పెద్ద సంఖ్యలో చేరి కొనుగోలు చేసుకొని తమ ఇళ్ల ముందు కాలుస్తూ కన్నుల పండువలా జరుపుకొన్నారు.
వాణిజ్యనగరిలో..
హుబ్లీ: వాణజ్య నగరి, విద్యా కాశీ జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలను ప్రజలు ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకుంటున్నారు. గురువారం నరకచతుర్దశి వేళ కొందరు లక్ష్మీ పూజను నెరవేర్చగా మరి కొందరు శుక్రవారం విశేషంగా తమ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి జరుపుకున్నారు. శనివారం పాడ్యమి శుభవేళ కూడా పలువురు లక్ష్మీ తదితర పూజలను జరుపుకుంటారు. ముఖ్యంగా నగరంలోని భారీ అంగళ్లు, విద్యుత్ దీపాలతో జిగేల్‌మంటున్నాయి. అరటి గెలలు, మామిడి ఆకులు, చెరకు గడలు, బంతి, చేమంతి, మల్లెపూలు తదితరాలతో జనతాబజార్, దుర్గదబైలు, చెన్నమ్మ సర్కిల్, దేశ్‌పాండే నగర, గుజరాత్ భవన్, వివిధ చోట్ల, ఈద్గా మైదానం, సంగొళ్లి రాయన్న తదితర కూడళ్లలో రైతులు అరటి గెలలు, మామిడి ఆకులు, చెరకు గెడలు, వివిధ రకాల పూలతో అవసరమైన వాటిని విక్రయించారు. దీంతో సహజంగానే గత వారం రోజులుగా ఈ ప్రాంతాలన్ని సందడిగా నెలకొన్నాయి. చెరకు గడ రూ.50 నుంచి రూ.100, అరటి గెల రూ.50 నుంచి 100 వరకు విక్రయించారు. మామిడి తోరణాలు తదితర వాటిని కూడా విశేషంగా ప్రజలు కొనుగోలు చేశారు. కొప్పికర్ రోడ్డు, దాజిబాణపేట, దుర్గద బైలు. మరాఠ గల్లి, సీబీటీ చుట్టు పక్కల మంగళ, బుధవారాల నుంచే గ్రామాల నుంచి పేద రైతులు, కూలీలు వీటిని తెచ్చి అమ్ముకున్నారు. వాహనాలకు కూడా ప్రత్యేకంగా పూజలు జరిపారు. కాస్త ఖరీదు అయినా కూడా బాణసంచాను కొనుగోలు చేసి పేల్చడం కనిపించింది. మొత్తానికి జంట నగరాల్లో పండుగ కళాకాంతులు విరజిమ్మగా అతి వానలతో చోటమోటా పట్టణాలు గ్రామాల్లో పండుగ సంబంరం అంతగా కనిపించలేదు. కాగా పోలీసులు మాత్రం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లతో 24 గంటల పాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బాణసంచా దుకాణాలు కిటకిట
హొసపేటె: దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం నగరంలో బాణసంచా దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. చిన్నపెద్దలు, మహిళలు ఎంతో ఇష్టపడే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకొంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరంలో బాణసంచా స్టాళ్లు ఏర్పాటు చేయడంతో నగరవాసులు తమకు కావాలసిన బాణసంచాను కొనుగోలు చేశారు. నగర వాసులు తమ ఇంటి ముందు పటాసులను పేల్చి దీపావళి సంబరాలను సంతోషంగా జరుపుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment