అనంతవాసికి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు
● 30 ఏళ్లుగా సహకార రంగంలో
సేవలకు గుర్తింపు
సాక్షి,బళ్లారి: ప్రతి ఏటా కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులను కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పంపిణీ చేసే కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు పొరుగున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన చేనేత వర్గానికి చెందిన తిప్పయ్య, తిప్పమ్మల కుమారుడు నేకార(చేనేత) విరుపాక్షప్పకు ఈ ఏడాది లభించింది. 40 సంవత్సరాల క్రితం ఆయన బళ్లారికి విచ్చేసి స్థిరపడినప్పటి నుంచి సహకార రంగంలో విశేష సేవలు అందించారు. 1991 నుంచి 1998 వరకు 7 సంవత్సరాల పాటు బళ్లారి జిల్లా నేకార ఉత్పత్తి, మారాట సహకార సంఘం అధ్యక్షుడిగా, 1993–2010 వరకు బళ్లారి అర్బన్ కో–ఆపరేటివ్ డైరెక్టర్‌గా, అలాగే ఆల్ ఇండియా ఫ్యాబ్రిక్ మార్కెంటింగ్ కో– ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్‌గా సేవలు అందించారు.
అందుకున్న అవార్డులు ఎన్నో..
ఈ నేపథ్యంలో ఆయనకు చేనేత రత్నభూషణ, వీవర్స్ గాడ్ ఫాదర్, సహకార నేకార బంధు తదితర అవార్డులు ఇప్పటికే లభించాయి. తాజాగా నవంబర్ 1న శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసే కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన చేతుల మీదుగా అందజేశారు. ఆయనతో పాటు గత ఏడాది అయోధ్యలో రామ్‌లల్ల విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అరుణ్ యోగి రాజు కూడా కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న చేనేత వర్గానికి చెందిన విరుపాక్షప్ప సాక్షితో మాట్లాడుతూ తన సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు ద్వారా మరింతగా బాధ్యత పెరిగిందన్నారు. కన్నడ భాష, చేనేత వర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment