పాల సంఘానికి పోలింగ్
తుమకూరు: అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమకూరు జిల్లా పాల సహకార ఉత్పత్తిదారుల సంఘం సమాఖ్యలో 10 మంది నూతన డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఓ పబ్లిక్ పాఠశాలలో పోలింగ్ జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు ఓటేశారు. ఉపవిభాగం అధికారి గౌరవ కుమార శెట్టి ఎన్నికలను పర్యవేక్షించారు. జిల్లాలోని 10 తాలూకాల నుంచి సుమారు 21మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు వచ్చిన 10 మంది డైరెక్టర్లు అవుతారు. పాల రైతులు, సభ్యులు ఉత్సాహంగా ఓటేశారు. గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు కల్పించారు.
ప్రధానిపై డీకేశి ధ్వజం
శివాజీనగర: ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఈ ఆరోపణలను రుజువుచేస్తే తాము ఏ శిక్షకై నా సిద్ధమేనని డీసీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. ఎన్నికల్లో అబద్ధాలే ఆలంబనగా ప్రధాని వంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సదాశివనగర తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో రూ.700 కోట్లు వసూలు చేసిందని ప్రధాని ఆరోపించడాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఆరోపణలను రుజువుచేస్తే ఏ శిక్షకై నా సిద్ధమేనన్నారు. కేంద్ర మంత్రులు ఎన్నికలకు ఎంతెంత సేకరిస్తున్నారనేది తనకు తెలుసని అన్నారు. మోదీ పదే పదే కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు, దీని వల్ల ఏమీ జరగదు. ప్రజలు ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పారన్నారు.
విమానాలకు
పొగమంచు అంతరాయం
దొడ్డబళ్లాపురం: ఆదివారం ఉదయం కెంపేగౌడ విమానాశ్రయం చుట్టుపక్కల దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 15 విమానాలు ఆలస్యంగా ఎగిరాయి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల దట్టమైన పొగమంచు అలముకొంది. దీంతో పైలట్లకు దారి కనిపించలేదు. ఇక్కడ దిగాల్సిన 6 విమానాలను చైన్నె, హైదరాబాద్‌కు మళ్లించారు.
ఇంట్లో భారీ చోరీ
చింతామణి: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి 800 గ్రాముల బంగారు నగలు, 7 లక్షల నగదు దోచుకొన్నారు. ఈ సంఘటన చింతామణి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నసంద్ర గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామంలోని పట్టు వ్యాపారి షఫీ కుటుంబంతో శనివారం బెంగళూరులోని కూతురి ఇంటికి వెళ్లాడు. రాత్రి దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి చొరబడ్డారు. బీరువాను విరిచేసి పైన పేర్కొన్న డబ్బు, సొత్తును దోచుకుని వెళ్లారు. ఆదివారం పొద్దున్నే తలుపులు తెరచి ఉండడం చూసి పక్క ఇళ్లవారు షఫీకి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వచ్చి చూడగా డబ్బు, నగలు కనిపించలేదు. డీఎస్పీ మురళీధర్, సీఐ శివరాజకుమార్, వేలిముద్ర నిపుణులు పరిశీలించారు. గ్రామంలో ఈ దోపిడీ కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment