ఆర్మీ నియామక ర్యాలీ రసాభాస
హుబ్లీ: దేశ రక్షణ సేవలో పాల్గొందామని ఉత్సాహంగా వచ్చిన నిరుద్యోగ యువతకు లాఠీ దెబ్బలే బహుమతిగా వచ్చాయి. అన్ని ఏర్పాట్లు చేసి సజావుగా ఎంపిక చేయాల్సిన ఆర్మీ సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరించి నిరుద్యోగుల పట్ల పాశవికంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. వివరాలు... ఉత్తర కర్ణాటక జిల్లాలకు సంబంధించి టెరిటోరియల్ ఆర్మీలో సైనికుల ఉద్యోగాల నియామకాలకు ఆదివారం బెళగావి నగరంలో నియామక ర్యాలీ జరిగింది. కొన్నిరోజులుగా జిల్లాలో అధికారులు జోరుగా ప్రచారం చేశారు. దీంతో శనివారం రాత్రి నుంచే వేలాది మంది యువకులు వచ్చారు. బెళగావిలో సీపీయడ్ మైదానం ఎదుట రాత్రి నుంచి చలిలో అన్న పానీయాలు లేకుండా నిరీక్షించారు.
తోపులాట, గందరగోళం
ఉదయాన్నే ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. 16 జిల్లాల నుంచి సుమారు 30 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. ఒక్కసారిగా మైదానంలో వచ్చే క్రమంలో తోపులాట జరిగి చాలామంది కిందపడిపోయారు. వారిని నియంత్రించే పేరుతో జవాన్లు, పోలీసులు లాఠీలు తీసుకుని విరుచుకుపడ్డారు. దీంతో లాఠీ దెబ్బలు తినలేక యువకులు తలోదిక్కుకు పరుగులు తీయడంతో అక్కడంతా యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో చాలామంది గాయాలతో అస్వస్థతకు లోనయ్యారు. వారికి వైద్య సేవలందించేందుకు అక్కడ కనీస ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత పోలీసులు, ఆర్మీ సిబ్బంది అందరిని క్యూలలో నిలబెట్టారు. తరువాత జాతీయ సైనిక స్కూల్ మైదానంలో పరుగు, దేశదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. చాలామంది అభ్యర్థులు పాల్గొనకుండానే వెనుతిరిగారు.
30 వేల మంది యువత బెళగావికి రాక
అదుపు చేయలేక లాఠీచార్జీ
Comments
Please login to add a commentAdd a comment