జిల్లాస్పత్రిలో కలెక్టర్ తనిఖీ
తుమకూరు: జిల్లాస్పత్రిని సోమవారం కలెక్టర్ శుభ కళ్యాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి భవనం పాతదైనందున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె జిల్లా సర్జన్ అస్గర్ బేగ్‌కు సూచించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో చిన్న పిల్లల ఐసీయూలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది శిశువుల మృతి నేపథ్యంలో ఆమె తనిఖీలు చేశారు. రోగులతో మాట్లాడి వైద్యచికిత్సల గురించి ఆరా తీశారు. వార్డుల్లోని రోగులకు ప్రతి రోజూ దుప్పట్లను మార్చాలని, నిరుపయోగ పరికరాలను తరలించి, పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. అగ్నిప్రమాదాల సమయంలో పాటించే జాగ్రత్తల గురించి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్పత్రిలో భద్రతా చర్యలపై తనకు సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా క్యాంటీన్ భవన పనులను పరిశీలించారు. డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సహాయక పాలనాధికారి రవి, వైద్యాధికారి డాక్టర్ చేతన్ తదితరులు ఉన్నారు.
బెమెల్ అధికారి ఆత్మహత్య
మైసూరు: పని ఒత్తిడితో మైసూరులోని బెమెల్ సంస్థ అధికారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. వివరాలు.. బోగాది నివాసి, బెమెల్ డీజీఎం ఎల్.మోహన్‌రావ్ (54) మృతుడు. కుటుంబ సభ్యులతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆయన మొబైల్ స్విచాఫ్ అయింది. దట్టగళ్లి రింగ్ రోడ్డులోని కేఈబీ సముదాయ భవనం వాచ్‌మెన్ షెడ్‌లో ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు ఆయన కనిపించకపోవడంతో వెతకసాగారు. షెడ్ సమీపంలో కారు కనిపించింది. షెడ్ లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకున్న స్థితిలో అతని మృతదేహం లభించింది. పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కువెంపునగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈడీ సోదాల్లో రూ.కోట్లు సీజ్
కృష్ణరాజపురం: కర్ణాటకతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి వందలాది కోట్ల రూపాయలను సీజ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, పంజాబ్‌తో పాటు 22 చోట్ల ఈడీ అధికారులు దాడి చేశారు. గేమింగ్ కంపెనీల నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేసి రూ.12.41 కోట్ల నగదును, ఇతర దాఖలాలను స్వాధీనపరచుకున్నారు. దీంతో పాటు అకౌంట్లలోని ఎఫ్‌డీఆర్‌తో పాటు రూ.6.42 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది.
ఈడీ ముందుకు సీఎం బావమరిది
బనశంకరి: ముడా స్థలాల కేసులో ఏ3 నిందితునిగా ఉన్న సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ముడా మాజీ అధ్యక్షుడు మరిగౌడ, అప్పటి కమిషనర్ నటేశ్‌తో పాటు పలువురిని గతంలో విచారించారు. మల్లికార్జున స్వామిని బెంగళూరులోని శాంతినగరలోని ఈడీ ఆఫీసులో ప్రశ్నించారు. భూమి కొనుగోలు గురించి సమాచారం రాబట్టారు.
సహజీవనంలో
అత్యాచారం.. కేసు రద్దు
బనశంకరి: సుమారు 20 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తూ ప్రియునిపై మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు రద్దుచేసింది. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసును రద్దు చేయాలని నెలమంగల నివాసి సతీశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. వివరాలు.. ఆంధ్రహళ్లి కి చెందిన వ్యక్తితో ఆ మహిళకు పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తకు ప్రాణాంతక జబ్బు సోకవడంతో 2004లో ఆమె అతన్ని వదిలేసి హోటల్‌లో పనిచేసేది. ఈ సమయంలో సతీశ్ అనే వ్యక్తితో పరిచయమై సహజీవనం ప్రారంభించారు. తరువాత కొన్నేళ్లకు సతీశ్ ఊరికి వెళ్లి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతని ప్రియురాలు అత్యాచారం, వంచన తదితరాలతో కేసు పెట్టింది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. ఈ కేసు కొట్టివేయాలని సతీశ్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఎం.నాగ ప్రసన్న.. కేసు రద్దుచేస్తూ తీర్పు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment