కిల్లర్ రిసార్టు సీజ్
దొడ్డబళ్లాపురం: మంగళూరు సమీపంలో ఉళ్లాలలో సముద్ర తీరం పక్కనున్న వాజ్కో బీచ్ రిసార్ట్‌లో స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మైసూరుకు చెందిన ముగ్గురు యువతులు మరణించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు రిసార్ట్ యజమాని మనోహర్, మేనేజర్ భరత్‌ను అరెస్టు చేశారు. రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే యువతులు చనిపోయారని కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా రిసార్ట్‌కు సరైన అనుమతులు లేవని, అయినా నడుపుతున్నారని తెలిసింది.
ఫోన్‌లో రికార్డు చేసుకుంటూ..
మైసూరుకు చెందిన యువతులు ఎన్ కీర్తన (21, దేవరాజ మొహల్లా), ఎండీ నిషిత (21, కురుబరహళ్లి), ఎస్ పార్వతి (20, కేఆర్ మొహల్లా) 16వ తేదీన రిసార్టుకు వచ్చారు. వీరు వివిధ డిగ్రీ కోర్సులు చదువుతున్నట్లు సమాచారం. 17న ఆదివారం ఉదయం పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికి లోతైన చోట మునిగిపోయారు. వారికి ఈత రాకపోవడం, లైఫ్‌జాకెట్లు వంటివి ధరించకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. కొంతసేపటికి రిసార్టు సిబ్బంది వచ్చి చూడగా నీళ్లలో మృతదేహాలు తేలుతున్నట్లు చూసి గట్టిగా కేకలు వేశారు. వారిని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు.
యువతులు తమ ఫోన్లను పూల్ ముందు పెట్టి జలకాలాటలను రికార్డింగ్ చేసుకుంటూ ఉండగా విషాదం చోటుచేసుకుంది. ఆ వీడియోలను చూసి తల్లిదండ్రులు అయ్యో అని గుండెలవిసేలా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు రిసార్టు నిర్వాహకులపై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు సీఐ బాలక్రిష్ణ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మృతదేహాలను మైసూరుకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మంగళూరు విడిదిలో ముగ్గురు
యువతుల జల సమాధి..
యజమాని, మేనేజర్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment