డ్రగ్స్‌పై యుద్ధమే
● హోం మంత్రి పరమేశ్వర్
మైసూరు: బెంగళూరులో చాక్‌లెట్ల రూపంలో డ్రగ్స్ లభిస్తున్నట్లు తెలిసింది, డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఆనేకల్ వైపు ఇలాంటి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. స్కూలు, కాలేజీ పిల్లలకు సరఫరా అమ్ముతున్నట్లు సమాచారం. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై డేగ కళ్లతో నిఘా వేశాం. ఇతర దేశాల నుంచి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న వారి సమాచారాన్ని ఆ దేశాల రాయబారులకు అందజేస్తున్నామన్నారు. డ్రగ్స్ కట్టడిపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు. మెడికల్ షాపుల్లో లభిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై మంత్రి జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీకి ఉప ఎన్నికల్లో చేటు చేశాయన్నారు. జమీర్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు.
దర్శన్ బెయిలు రద్దుకు
సుప్రీంకు పోలీసులు!
దొడ్డబళ్లాపురం: దర్శన్ బెయిలు రద్దు చేయాలని కోరుతూ పోలీసులు మూడు రోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు వేయనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 20 లేదా 21న సుప్రీంకోర్టులో బెయిలు రద్దు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దర్శన్ వెన్నునొప్పి కారణంతో ఆపరేషన్ చేయించుకోవడానికి మధ్యంతర బెయిలు ఇచ్చిన హైకోర్టు.. వైద్య నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 6న దర్శన్ లాయర్ ఈ మేరకు నివేదికను సమర్పించారు. అయితే దర్శన్ ఆపరేషన్ చేయించుకున్నట్టు అందులో లేదు. మరోవైపు ప్రధాన నిందితురాలు, దర్శన్ ప్రేయసి పవిత్రగౌడ కు ఇంకా బెయిలు లభించలేదు.
మహిళను భక్షించిన చిరుత
దొడ్డబళ్లాపురం: చిరుత దాడిలో మహిళ మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా శివగంగ కొండ సమీపంలో కంబాళు గొల్లరహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి కరియమ్మ (55) ఆదివారం రాత్రి పశువులకు మేత తీసుకురావడానికి ఊరిబయటకు వెళ్లింది. అక్కడ పొలంలో సంచరిస్తున్న చిరుత కరియమ్మపై పడి తల కొరికి వేరుచేసింది. దేహాన్ని కొంతమేర భక్షించించింది. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వెతుకుతూ వెళ్లగా తల, మొండెం కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న చిరుత వారి మీద దాడికి యత్నించగా కట్టెలతో తరిమికొట్టారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బీజేపీ సర్కారు సిద్దు
పుణ్యమే: జోషి
హుబ్లీ: గతంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కొందరు ఎమ్మెల్యేలను సిద్దరామయ్యే పంపించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి చెప్పారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆపరేషన్ కమల చేస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన ఈ విధంగా బదులిచ్చారు. హెడ్‌డీ కుమారస్వామి సీఎంగా ఉండరాదన్న కసితో సిద్దరామయ్య కొందరు ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపించారన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఈసారి కాంగ్రెస్‌కు మెజార్టీ ఉంది. బీజేపీ విపక్షంగా పని చేస్తుందన్నారు. బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా రికార్డులు ఉంటే ఎమ్మెల్యే రవి గాణిగ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముడా కేసులో సిద్దరామయ్య ఇరుక్కు పోయాడు. దీంతో ఆయన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు.
మాజీ కమిషనర్‌కు నోటీసులు
మైసూరు: ముడాలో జరిగిన స్థలాల పంపిణీ కేసులో లోకాయుక్త అధికారులు తాజాగా ముడా గత కమిషనర్ నటేష్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేష్, అనుమతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా, అనుమతించారు. దీంతో మంగళవారం మైసూరులోని లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నటేష్‌కు నోటీసులిచ్చారు. నటేష్‌ను గతంలో ఈడీ అధికారులు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment