లోకాయుక్త మళ్లీ పంజా
సాక్షి, బెంగళూరు: వారంరోజుల కిందటే విస్తృతంగా అధికారుల ఇళ్లపై దాడులు చేసిన లోకాయుక్త గురువారం రెండోసారి పంజా విసిరి సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని నలుగురు అవినీతి అధికారులకు సంబంధించి 25 చోట్ల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపింది.
ఎవరెవరి మీద..
అబ్కారీ శాఖ ఎస్పీ మోహన్, యోజనా శాఖ డైరెక్టర్ ఎన్‌కే తిప్పేస్వామి, కావేరి జలవనరుల బోర్డు ఎండీ మహేశ్, భూవిజ్ఞాన శాఖ శాస్త్రవేత్త ఎంసీ కృష్ణవేణిల ఇళ్లు, కార్యాలయాలలో ముమ్మరంగా సోదాలు జరిపింది. ఇందులో పెద్ద మొత్తంలో బంగారు, వెండి, వజ్రాభరణాలు, నగదు, ఆస్తులను గుర్తించారు. బెంగళూరులో కె.మోహన్ కార్యాలయం, కనకపుర రోడ్డులోని ఇల్లు, అలాగే ఎన్‌కే తిప్పేస్వామి బనశంకరిలోని ఇల్లు, కార్యాలయం, కావేరి జలవనరుల విభాగం ఎండీ మహేశ్ కార్యాలయం, మండ్యలోని ఇల్లు, చిక్కబళ్లాపురలోని భూవిజ్ఞాన శాఖ శాస్త్రవేత్త ఎంసీ కృష్ణవేణి ఇంటిలో సోదాలు సాగాయి.
ఎక్కడెక్కడ
మహేశ్ ప్రస్తుతం బెంగళూరు కావేరి జలవనరుల శాఖ కార్యాలయంలో పని చేస్తున్నారు. మండ్య కేఆర్‌ఎస్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్, మళవళ్లిలోని మహేశ్ మామ కృష్ణప్ప, మళవళ్లి తాలూకా దళవాయి కోడిగళ్లి గ్రామంలో ఉండే ఇంటిలోనూ తనిఖీలు జరిగాయి. మంగళూరులో భూవిజ్ఞాన శాఖ అదికారిగా పని చేస్తున్న కృష్ణవేణి ఇంటిపై లోకాయుక్తా అధికారులు దాడి జరిపారు. వేలెన్సియా వద్ద ఉన్న ఫ్రెడ్‌రోజ్ ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ను అధికారులు పరిశీలించారు. చిక్కబళ్లాపురలో ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు. కృష్ణవేణి గత రెండు నెలల క్రితమే మంగళూరుకు బదిలీ అయ్యారు. లోకాయుక్త అధికారులు సురేష్‌బాబు, సునీల్‌కుమార్, నటరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
నలుగురు అధికారుల ఇళ్లలో సోదాలు
భారీమొత్తంలో నగదు, బంగారం గుర్తింపు
అపారమైన ఆస్తులు
యోజనా శాఖ డైరెక్టర్ ఎన్‌కే తిప్పేస్వామి వద్ద అపారమైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. బెంగళూరు గిరినగరలోని ఆయన ఇంటిలో భారీమొత్తంలో బంగారు ఆభరణాలు లభించాయి. 28కి పైగా బంగారు కమ్మలు, 8కి పైగా ఖరీదైన వాచ్‌లు, 23కు పైగా బంగారు గొలుసులు ఉన్నాయి. రూ. 7 లక్షల నగదు, పలు ఆస్తుల పత్రాలను కూడా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment