పాలకులూ.. బాగేపల్లిని చూడరూ!
బాగేపల్లి: రాష్ట్రంలోనే వెనుక బడిన ప్రదేశంగా గుర్తింపు పొందిన బాగేపల్లికి వ్యవసాయ పంటల సాగుకు శాశ్వత నీటిపారుదల సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగ సమస్య తీర్చేలా పరిశ్రమలను స్థాపించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం బాగేపల్లి పట్టణంలోని డాక్టర్ హెచ్‌ఎన్ సర్కిల్‌లో జరిగిన సీపీఎం జిల్లా సమ్మేళనం, సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కొరవడిందని, వ్యవసాయానికి నీరు లేక పరిశ్రమలు లేని కారణంగా ఉద్యోగాలు కరువయ్యాయి. ఇంజినీరింగ్ చదువుకున్న యువకులు బెంగళూరులాంటి నగరాలకు వలస వెళ్లి సెక్యూరిటీ గార్డులుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదలు, కార్మికులు, కూలి కార్మికుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే దేశంలో సీపీఎంని బలపరచాలన్నారు. అంతకు ముందు పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి ప్రధాన వీధుల గుండా సీపీఎం కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించారు. సీపీఎం నేతలు యూ.బసవరాజు, కేఎన్ ఉమేష్, మునివెంకటప్ప, రఘురామరెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ సహా వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. కళాకారుల విప్లవ నాట్య ప్రదర్శన, గీతాలు రంజింపజేశాయి.
నీటి వసతి, పరిశ్రమలు కల్పించాలి
సీపీఎం నేత రాఘవులు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment