ఆలయంలో స్నాచింగ్.. ఘరానా దొంగ అరెస్టు
కృష్ణరాజపురం: దసరా నవరాత్రుల సమయంలో ఆలయంలో భజన చేస్తుండగా కిటికీలో నుంచి మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితుడు వసంతరాజుని నగరంలోని నందిని లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. విలాసాలకు అలవాటు పడిన నిందితుడు వసంతరాజు మద్యం తాగి ఆలయ పరిసరాల్లో సంచరిస్తూ పలు గొలుసు చోరీలు, సమీపంలోని కాలనీల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుండేవాడు.
సగం గొలుసుతో పరారీ
అక్టోబర్ 10వ తేదీన శంకర నగరలోని గణపతి దేవస్థానంలో మహిళలు భజన చేస్తుండగా, కిటికీ సమీపంలో కూర్చొని ఉన్న మహిళ మెడలోని గొలుసు లాగాడు. బాధిత మహిళ అడ్డుకోవడంతో సగం గొలుసు మాత్రమే అతని చేతికి చిక్కింది. దాంతో పరారయ్యాడు. మహిళలు హాహాకారాలు చేశారు. ఈ వీడియో అంతటా ప్రచారమైంది. ఈ ఘటనపై నందిని లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు నెలన్నర రోజుల తర్వాత నిందితుడు వసంతరాజుతో పాటు అతని సహాయకుడు అతీకుల్లాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగైదు దొంగతనాల్లో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం నిందితుల వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువ చేసే 113 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనపరచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment