కాషాయం.. కలహాల కాపురం
సాక్షి, బెంగళూరు: ప్రతిపక్ష బీజేపీలో అంతః కలహాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. ఆరోపణలతో రెచ్చిపోతున్న నాయకులను చూసి కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. అనేక రాష్ట్రాల్లో అప్రతిహతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్న ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం.. ఈ సంక్షోభాన్ని ఎలా అదుపు చేయాలా? ఆలోచనలో పడింది. బీజేపీలో గొడవలతో కాంగ్రెస్ సర్కారు కులాసాగా ఉంటోంది.
ఆనందం కొన్నిరోజులే
లోక్‌సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను గెలుపొంది ఊపుమీదున్న రాష్ట్ర బీజేపీ, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ఇటీవల మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు షాకిచ్చాయి. మూడు చోట్ల పరాజయం పాలై నీరుగారిపోయారు. ఇదే అదనుగా మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ రూపంలో రెబెల్స్ వర్గం పుట్టుకొచ్చింది. విజయేంద్ర, యడియూరప్పలపై యత్నాళ్ తరచూ ఆరోపణలతో విరుచుకుపడడం తెలిసిందే. అసలు విజయేంద్ర ఆ పదవికి పనికిరాడని ఆయన దుయ్యబడుతున్నారు. గొడవలకు కొత్త అయిన విజయేంద్ర అంత తీవ్రంగా స్పందించడం లేదు. కొంతమంది బీజేపీ నాయకులు మాత్రమే యత్నాళ్‌పై ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ వివాదం వల్ల పార్టీకి తీవ్ర నష్టం వస్తోందని నాయకులు ఆందోళనలో ఉన్నారు.
చర్యలపై మీమాంస
బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా యత్నాళ్ ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. కుమారుడు విజయేంద్ర ఆనాడు పాలనలో జోక్యం చేసుకుంటున్నారని కూడా విమర్శించారు. యత్నాళ్‌పై అధిష్టానం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యత్నాల్ ఆరోపణలపై విసిగిపోయిన యడియూరప్ప బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే హైకమాండ్ కేవలం యత్నాల్‌కు నోటీసులు మాత్రం ఇచ్చింది.
యత్నాళ్ శిబిరానికి బలం
హైకమాండ్ చూసీచూడనట్లు ఉండడం యత్నాళ్‌కు బలం చేకూర్చినట్లు అయింది. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా సొంతంగా యాత్రను చేపట్టడం గమనార్హం. ఆయన చుట్టూ పలువురు సీనియర్లు చేరుతున్నారు. రమేశ్ జార్కిహొళి, బీపీ హరీశ్, కుమార బంగారప్ప వారిలో ఉన్నారు. మాజీ ఎంపీ ప్రతాప్ సింహా కూడా యత్నాళ్ వెంట కనిపిస్తున్నారు. దీంతో విజయేంద్ర వర్గంలో కలవరం పెరిగిపోతోంది. పార్టీలోని సీనియర్లకు విలువ ఉండడం లేదని, ఏకపక్షంగా విజయేంద్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని యత్నాళ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఎక్కడికి పోతుందోనని కాషాయవాదుల్లో ఆందోళన నెలకొంది.
ఇంత రాద్ధాంతమా?
● సదానంద ఆవేదన
బనశంకరి: రాష్ట్ర బీజేపీలో నేతలు మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయని, ఇగో సమస్య పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని మాజీ సీఎం డీవీ.సదానందగౌడ వాపోయారు. గురువారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలో అంతః కలహాలు తీవ్రరూపం దాల్చాయని, దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పార్టీలో ఇంత రాద్దాంతం జరుగుతుంటే సహించడం సాధ్యం కాదు. డిసెంబరు 3న ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ పరిణామాలపై చర్చించి వీటికి అడ్డుకట్టవేయాలని హైకమాండ్ డిమాండ్ చేస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు లేఖలు రాశానన్నారు. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో అనంత్‌కుమార్, యడియూరప్ప గ్రూపులు బలంగా ఉండేవి. కానీ ఇలా ఎప్పుడూ వీధుల్లోకి రాలేదన్నారు. దీనికి బదులుగా ఢిల్లీలో పరిష్కరించుకోవాలని విజయేంద్ర, యత్నాళ్ వర్గాలకు హితవు పలికారు.
రోజురోజుకు ఉగ్రరూపం
పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, యడ్డిపై యత్నాళ్ ఆరోపణలు
హైకమాండ్ వైపు యడ్డి చూపు
విజయేంద్ర
కుమ్మక్కు: యత్నాళ్
సాక్షి, బళ్లారి: పాము– ముంగిస తరహాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ఎమ్మెల్యే బసనగౌడ యత్నాళ్ ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయేంద్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరకు వెళ్లి 20 పనుల మీద సంతకాలు చేసుకున్నారని యత్నాళ్ ఆరోపించారు. విజయపుర జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వీడియో తన దగ్గర ఉందన్నారు. విజయేంద్ర ఇదే మాదిరిగా సీఎం సిద్దరామయ్య దగ్గరకు కూడా వెళ్తారని హేళన చేశారు. తాను మాత్రం పనుల కోసం ఎవరి ఇంటికీ వెళ్లనని, కావాలనే కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.
చర్యల కోసం అమిత్ షాకు రక్త లేఖలు
మండ్య: విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ నోటికి కళ్లెం వేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు బీజేపీ కార్యకర్తలు రక్తంతో లేఖలు రాశారు. వాటిని మండ్య నగరంలోని తపాలాఫీసులో పోస్టు చేశారు. యడియూరప్ప, బీవై విజయేంద్రలపై నిరంతరం నోరు పారేసుకుంటున్న యత్నాళ్‌కు బుద్ధి చెప్పి క్రమశిక్షణ చర్యలు చేపట్టి నోరు మూయించాలని కోరారు. రాష్ట్రంలో పార్టీకి ఆయన చేటు తెస్తున్నారన్నారు. తక్షణమే ఆయన దూకుడుకు పార్టీ పెద్దలు అడ్డుకట్ట వేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment