జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వినతి
బళ్లారిఅర్బన్: జిల్లా వైమానిక అభివృద్ధి, రైల్వే, హైవేలు, పరిశ్రమలు తదితరాల పెరుగుదల, సంబంధిత సమస్యల పరిష్కారానికి సహకరించాలని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో బళ్లారి ఎంపీ ఈ.తుకారాం నేతృత్వంలో ఆ సంస్థ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి, మాజీ అధ్యక్షుడు టీ.శ్రీనివాసరావు, ప్రముఖులు సీఏ రాజశేఖర్ బృందం కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, పర్యావరణ, అటవీ, వాతావరణ డైరెక్టరేట్ డైరెక్టర్ అమరదీప్ రాజు, రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నాసీర్ హుస్సేన్‌లను వేరువేరుగా కలిసి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయాలని బృందం సభ్యులు కోరారు. ముఖ్యంగా కేంద్రమంత్రిని కలిసి బళ్లారి సమీపంలో 1000 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏళ్లు గడిచాయని, విమానాశ్రయం ఇంకా పెండింగ్‌లోనే ఉందని వివరించారు.
విమానాశ్రయంతో పర్యాటక వృద్ధి
ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రపంచ పర్యాటక కేంద్రం హంపీ, చారిత్రక సంగనకల్లు టూరిజం, పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధితో పాటు దక్షిణ భారతంలోని మిగతా రాష్ట్రాలకు బళ్లారి అన్ని విధాలుగా వారధిగా నిలుస్తుందన్నారు. రైల్వే మంత్రికి ముంబై–హొసపేటె, షోలాపూర్– హొసపేటె రైళ్ల సర్వీసులను బళ్లారి వరకు విస్తరించాలని కోరారు. ఫలితంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం, గార్మెంట్, ఇతర పరిశ్రమలు, ఉద్యానవన పంటలు, రెడీమేడ్ ఆహారం, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ముఖ్యంగా హొసపేటె– బళ్లారి– బెంగళూరుల మధ్య వందే భారత్ రైలును నడపాలని, అలాగే హొసపేటె–బళ్లారి– బెంగళూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలను మార్చాలని కోరారు. జిల్లాకు సంబంధించి సమగ్రమైన అభివృద్ధితో పాటు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నివేదికలను శాఖల వారీగా ఆయా మంత్రులకు సమర్పించింది. కాగా ఈ విషయంలో సంబంధిత అధికారి అమరదీప్ రాజు ఈ నెల 27న సమావేశం నిర్వహించి అన్ని విషయాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఢిల్లీలో కేంద్రమంత్రులతో
చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల భేటీ
Comments
Please login to add a commentAdd a comment