బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి

Published Tue, Dec 24 2024 12:21 AM | Last Updated on Tue, Dec 24 2024 12:21 AM

బైక్‌

బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి

శివమొగ్గ: ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శివమొగ్గ నగరంలోని హెలిప్యాడ్‌ సర్కిల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. నగరంలోని జేఎన్‌ఎన్‌సీఈ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి, మూలతః మలెబెన్నూరు వాసి జీవన్‌ (20), బెంగళూరులోని ప్రైవేట్‌ సంస్థ ఉద్యోగి రోహిత్‌ (23) మృతులు. వీరిద్దరూ బంధువులు కాగా కేటీఎం బైక్‌లో బొమ్మనకట్టె బడావణెలోని తమ బంధువు ఇంటికి వెళుతుండగా, ఓ వేడుకకు బాడుగకు వెళ్లి వస్తున్న ప్రైవేట్‌ బస్సు ఢీకొంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ జీకే మిథున్‌ కుమార్‌, ఏఎస్పీ అనిల్‌ కుమార్‌ భూమరెడ్డి, ట్రాఫిక్‌ సీఐ సంతోష్‌కుమార్‌ పరిశీలించారు. ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌పై పశ్చిమ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

29న నడ్డా రాక

శివాజీనగర: బెళగావిలో శీతాకాల సమావేశాల మధ్యలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఢిల్లీకి వెళ్లి వచ్చారు. పార్టీ పెద్దలతో భేటీ తరువాత ఆయన సంతోషంతో తిరిగి వచ్చారు. రెబెల్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌పై పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని సమాచారం. ఈ తరుణంలో 29న ఆదివారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరుకు వస్తున్నారని తెలిసింది. పార్టీ సభ్యత్వ నమోదు, బలోపేత చర్యల గురించి చర్చించనున్నారు. ఉప ఎన్నికల్లో పరాజయం, జేడీఎస్‌తో పొత్తు, యత్నాళ్‌ గొడవలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.

దూసుకొచ్చిన బస్సు..

కారు, ఆటో నుజ్జు

యశవంతపుర: కేఎస్‌ ఆర్‌టీసీ బస్సు సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ ఫెయిలై ముందు ఉన్న కారు, అటోను ఢీకొన్న ఘటన బెంగళూరు జ్ణానభారతి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. జ్ణానభారతి మెట్రోస్టేషన్‌ సమీపంలోని సిగ్నల్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆటోడ్రైవర్‌, ఇద్దరు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెంగేరి వైపు నుంచి నగరంలో వస్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు మెట్రో సిగ్నల్‌ వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ దూసుకొచ్చింది. ఆటో, కారు నుజ్జునుజ్జుయ్యాయి. అదృష్టవశాత్తు అక్కడ జన సంచారం లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

విచారణకు మాజీ మంత్రి

యశవంతపుర: బంగారు నగల షాపులో ఓ మహిళ రూ. 2.5 కోట్ల నగలు తీసుకుని మోసగించిన కేసులో మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌ బెంగళూరు కమర్షియల్‌ స్టీట్‌ పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. శ్వేతా అనే మహిళ ప్రకాశ్‌ పేరు, చిరునామా చెప్పి బంగారం తీసుకెళ్లింది. నగల షాపు యజమాని ఆ చిరునామాకు వెళ్లగా మోసం జరిగిందని తెలిసి కమర్షియల్‌ వీధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ప్రకాశ్‌ పేరు ఉండడంతో పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. తనకు శ్వేతతో ఎలాంటి సంబంధం లేదని ప్రకాశ్‌ తెలిపారు.

అమిత్‌ షాను తొలగించాలి

మైసూరు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కించపరిచారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని సోమవారం నగరంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేశారు. సంగొళ్లిరాయణ్ణ సర్కిల్‌లో ప్రధాని మోదీ, అమిత్‌షా చిత్రపటాలకు నిప్పంటించి నినాదాలు చేశారు. తరువాత జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. మంత్రులు మహదేవప్ప, కే.వెంకటేష్‌, తన్వీర్‌సేఠ్‌, ఎమ్మెల్యే హరీష్‌గౌడ, దర్శన్‌ ధ్రువనారాయణ్‌, రవిశంకర్‌, ఎమ్మెల్సీలు యతీంద్ర పాల్గొన్నారు.

మండ్యలో

మండ్య: అమిత్‌ షాకు వ్యతిరేకంగా మండ్యలో బహుజన సమాజ్‌ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జిల్లాధికారి, జిల్లా ఎస్పీ కార్యాలకు వెళ్లి వినతిపత్రాలను సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి 1
1/2

బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి

బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి 2
2/2

బైక్‌ను బస్సు ఢీ.. ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement