మత్తు కోసం తంటా.. ముగ్గురు ఖైదీల మృతి
మైసూరు: మత్తు కోసం బేకరీ ఎసెన్సు తాగి ఆస్పత్రి పాలైన ఖైదీలు మృత్యువాత పడ్డారు. వీరు నగరంలోని సెంట్రల్‌జైలు ఖైదీలు. వివరాలు.. వివిధ నేరాల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సాత్‌గళ్లి మాదేశ్, కొళ్లెగాల నాగరాజు, హాసన్ రమేష్ జైలులో బేకరీ విభాగంలో పని చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పెద్దమొత్తంలో కేక్‌ల తయారీ సామగ్రిని తెచ్చి పెట్టారు. ఇందులో కేకుల్లో వాడే ఎసెన్సు ద్రవాలు కూడా ఉన్నాయి. మత్తు వస్తందంటూ ఈ ముగ్గురు గతనెల 26న ఎసెన్సులను తాగేశారు. కేక్‌లకు రంగు, సువాసన రావడానికి వీటిని అతి స్వల్ప మొత్తంలో వాడతారు. నేరుగా కడుపులోకి వెళ్తే ప్రమాదం. అది తాగితే నిషా వస్తుందని ఎవరో చెప్పడంతో ఆ పని చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి ముగ్గురికీ మత్తు రాకపోగా పట్టలేనంత కడుపునొప్పి మొదలైంది.
నిజం చెప్పడం ఆలస్యమై..
సిబ్బంది వారిని జైలులోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఖైదీలు నిజం చెప్పలేదు. కడుపునొప్పి తగ్గకపోవడంతో ముగ్గురిని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల విచారణలో ఎట్టకేలకు తాము ఎసెన్స్ తాగినట్లు ఒప్పుకున్నారు. అప్పటికే సమయం మీరడంతో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స పొందుతూ మంగళవారం మాదేశ్, బుధవారం నాగరాజ్, రమేష్ మరణించారు. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై మండి మొహల్లా స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జైళ్ల శాఖ డీఐజీ జైలును పరిశీలించారు.
మైసూరు సెంట్రల్ జైలులో విషాదం
బేకరి ఎసెన్స్ తాగిన వైనం
Comments
Please login to add a commentAdd a comment