కేఆర్‌ఎస్ డ్యాం ఇప్పటికీ ఫుల్
● ఏమాత్రం తగ్గని నీటి మట్టం
● జలాశయం చరిత్రలో రికార్డు
మండ్య: జిల్లా రైతుల జీవనాడిగా పేరొందిన కృష్ణరాజసాగర(కేఆర్‌ఎస్) డ్యాం చరిత్రలో 156 రోజుల సుదీర్ఘ కాలం 124 అడుగుల మేర నీటి నిల్వ కొనసాగింది. ఇది చారిత్రక రికార్డు అని అధికారులు చెప్పారు. జలాశయ గరిష్ట మట్టం 124.80 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 124.30 అడుగుల మేర అంటే 49.452 టీఎంసీల సామర్థ్యానికి గాను 48.754 టీఎంసీల నీరుంది. సామాన్యంగా జనవరి నెల నాటికి జలాశయంలో నీటి మట్టం 110 లేదా 102 అడుగులకు తగ్గిపోతుంది. కానీ గత రెండు నెలలు వరుసగా తుపాను వర్షాలు రావడంతో నీటికి కొరత లేకుండా పోయింది.
వేసవి పంటలకు నీరు
ఈ సీజన్‌లో వేసవి పంటలకు నీరందించడం కష్టం అనే పరిస్థితి ఏర్పడుతుండేది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేరినందున మరొక పంట పండించుకునేందుకు నీరు లభిస్తుందని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి చలువరాయస్వామి, నీటి సంఘాలు సమావేశమై ఈనెల 10 నుంచి 18 రోజుల పాటు కాలువలకు నీరు వదిలాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులు స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు రబీ పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు.
గంధపు చెట్ల చోరీ
మైసూరు: లక్షలాది రూపాయల విలువ చేసే నాలుగు గంధపు చెట్లను దొంగలు నరికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మైసూరు వినోబా రోడ్డులోని ఆర్‌జీఎస్ సాఫ్ట్ సిస్టం సంస్థ ఆవరణలో జరిగింది. ఆవరణలో కొన్ని గంధపు చెట్లు ఉన్నాయి. వాటిపై కన్నేసిన దొంగలు మంగళవారం రాత్రి గుట్టుగా వచ్చి నరికి తరలించారు. బుధవారం ఉదయం సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవరాజ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మొదటి భర్త ఉండగానే
రెండో పెళ్లి
● మహిళకు రెండేళ్ల జైలు శిక్ష
హొసపేటె: మొదటి భర్త ఉండగానే అతనిని వదిలేసి మరో పెళ్లి చేసుకున్న కేసులో మహిళకు జేఎంఎఫ్‌సీ కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. దేవిక అనే మహిళకు 2008 మార్చి 21న సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014 ఫిబ్రవరి 25న బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఆలహళ్లి గ్రామానికి చెందిన అంబరీష్‌ను రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో పెళ్లి చేసుకుంది. దీంతో తనను మోసం చేసిందని మొదటి భర్త టీబీ డ్యాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం ఎస్‌ఐ స్వామి కేసు దర్యాప్తు చేసి నిందితురాలిపై విచారణ జరిపి చార్జిషీటును దాఖలు చేశారు. హొసపేటెలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ సాగుతోంది. మంగళవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అశోక్.. నిందితురాలు దేవికకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. పీపీ రేవణ్ణ సిద్దప్ప వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment