కొబ్బరి చట్నీకి కత్తెర!
హుబ్లీ: టెంకాయ పగలగొట్టి పచ్చి కొబ్బరితో చేసిన చట్నీతో ఇడ్లీ, వడ, దోసెలు తింటే ఆ మజానే వేరు కదా. రోజువారి ఒత్తిళ్ల జీవితం మధ్య ఆ రుచేలే సాంత్వనిస్తాయని చెప్పాలి. కొబ్బరి పచ్చడి అంటే నోరూరని వారు ఉండరు. ఏ హోటల్‌కు వెళ్లినా ఇడ్లీ, దోసెలకు పక్కన అది లేకపోతే ఏదో లోటే. ఇప్పుడా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కారణం.. టెంకాయల ధరలు ఉన్నపళంగా ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా హోటళ్లలో ధారాళంగా చట్నీ వడ్డించడం హోటల్ యజమానులకు భారంగా మారిందంటున్నారు. ధర పెరడంతో వేడివేడి బెన్న దోసెకు పేరుగాంచిన దావణగెరెలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో బెన్న దోసె ధరలు పెంచాలని యజమానులు యోచిస్తున్నారు.
ధరాభారం వల్ల కొన్ని హోటల్లో అయితే కొబ్బరి చట్నీకి ప్రత్యామ్నాయం తీసుకున్నారు. బెన్నదోసెకు– కొబ్బరి చట్నీకి ఉన్న బంధం తెంచలేనిది. కానీ ఆ చట్నీ లేకుండా దోసెను తినడం మహా పాపమని పలువురు తిండిప్రియులు చమత్కరిస్తున్నారు. యజమానులు టెంకాయలను తగ్గించి పప్పుల వాడకాన్ని పెంచారు.
పెరిగిన ధరలు
వినాయక చవితి పండుగ నుంచి ధర తాకిడి మొదలైంది. ఒక్కో కాయ టోకుగా రూ. 28, చిల్లరగా రూ. 35 వరకు పలుకుతోంది. చిక్కజాజూరు హొసదుర్గ, హొలల్‌కెరె, రామగిరి, ప్రాంతాల నుంచి ఎక్కువగా టెంకాయలు దిగుమతి అవుతాయన్నారు. ఇది ఇలా ఉండగా ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్‌లలో 30కు పైగా మండీలు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 12 అంగళ్లకు మాత్రమే కాయాలు వస్తున్నాయి. తగు మేర రాక పోవడంతో సదరు అంగళ్ల బంద్ అయ్యాయి. మొత్తానికి హోటళ్లలో కొబ్బరి సంక్షోభం నెలకొంది.
వక్క తోటలే కారణమా?
టెంకాయల ధరలు భగ్గు
హోటళ్లలో చట్నీ ప్రియం
దావణగెరెలో చట్నీపై నియంత్రణ
దావణగెరి జిల్లాకు సంతెబెన్నూరు, రామగిరి, హోసదుర్గ, భద్రావతి, తుమకూరు, గుబ్బిల నుంచి టెంకాయలు సరఫరా అవుతాయి. టెంకాయ సగటు వ్యాపారి శివకుమార్ ఈ సమస్య పై మాట్లాడుతూ చాలా మంది రైతులు టెంకాయ పంటను విడిచి వక్క తోటల సాగు చేపట్టారు. అంతేగాక ఈసారి పంట కూడా బాగా తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగింది. గత ఏడాది కూడా వానలు కురవక టెంకాయల దిగుబడి అంతంతే. దీంతో హోటల్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ చట్నీ రుచిగా ఉండాలంటే పచ్చి కొబ్బరి పడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment