పూజారి.. అయ్యాడు ఆలయాల దొంగ
మండ్య: రెండు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగని గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తుని స్వాధీనపరచుకున్నారు. కేఆర్‌పేటె తాలూకా సంతేచాచళ్లి ఫిర్కా ఆగాలయ గ్రామానికి చెందిన ప్రదీప్ (35) పట్టుబడిన నిందితుడు. చోరీకి గురైన దేవుని ఆభరణాలు, పూజా సామగ్రి వస్తువులను జప్తు చేశారు. ఈ నెల 3న పట్టణంలోని కనకపుర రోడ్డులోని పేటె మంచనహళ్లి గ్రామానికి చెందిన మూగదేవమ్మ దేవస్థానంలో, గౌడగెరె గ్రామంలోని బసవేశ్వర ఆలయంలో దొంగతనాలు జరిగాయి. పోలీసులు దర్యాప్తు చేసి ప్రదీప్ అనే దొంగను అరెస్టు చేసి రూ.1.65 లక్షల నగదుతో పాటు రూ.5.5 లక్షల విలువ చేసే ఆభరణాలను జప్తు చేశారు. ప్రదీప్ కూడా ఓ ఆలయంలో పూజారిగా సేవలందిస్తున్నాడు. తరువాత ఆ వృత్తి మానేసి ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతూ జల్సాలకు పాల్పడేవాడని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఏటీఎం మోసగాని అరెస్టు
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన ప్రజలను మోసగిస్తున్న వంచకున్ని పోలీసులు బంధించారు. గుండ్లుపేటె తాలూకా తమ్మడహళ్లి గ్రామానికి చెందిన లోకేష్ పట్టుబడిన నిందితుడు. గత వారం గుండ్లుపేటె తాలూకా వడ్డనహొసహళ్లికి చెందిన దాసశెట్టి అనే వ్యక్తి డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చాడు. తాను సాయం చేస్తానంటూ అతని నుంచి ఏటీఎం కార్డును తీసుకున్న లోకేశ్ అది పనిచేయడం లేదంటూ నకిలీ కార్డును బాధితుని చేతిలో పెట్టాడు. తరువాత లోకేశ్ వేరే ఏటీఎం కేంద్రంలో రూ.50 వేలు డ్రా చేయడంతో దాసశెట్టి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పరశివమూర్తి ఎస్ సాహేబ్‌గౌడ తదితరులు గాలించి లోకేష్‌ను అరెస్టు చేశారు. గతంలో ఇదే మాదిరిగా అనేకమందిని మోసగించినట్లు లోకేశ్ ఒప్పుకున్నాడు.
పెరోల్‌పై వచ్చిన ఖైదీ పరార్
మైసూరు: పెరోల్‌పై ఇక్కడి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఖైదీ గడువు ముగిసినా వాపసు రాలేదు. దీంతో ఖైదీ, అతనికి జామీను ఇచ్చిన వారిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బానోతు వెంకణ్ణ అనే వ్యక్తికి ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అతనికి 2024 సెప్టెంబర్ 30న కోర్టు 90 రోజుల పెరోల్ సెలవును ఇచ్చింది. తిరిగి జైలుకు వచ్చి లొంగిపోవాల్సి ఉంది. అవధి దాటినా అడ్రస్ లేడు. దీంతో అతనిపై అరెస్టు వారెంట్ జారీ కావడంతో పాటు అతనికి జామీను ఇచ్చిన బానోతు గీతా, బానోతు కృష్ణలపై కూడా వారెంట్ జారీ చేసి గాలింపు చేపట్టారు.
కెమికల్ తాకిడికి ఒకరు మృతి
చిక్కబళ్లాపురం: ట్యాంకర్ లారీలో నుంచి రసాయనాలను డంపింగ్ చేస్తుండగా ఊపిరాడక ఓ కార్మికుడు చనిపోగా, ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిక్కలో నంది పోలీస్ ష్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రసాయనాల లోడును తెప్పించారు. ట్యాంకును తెరిచి కెమికల్‌ను డంపింగ్ చేస్తున్న సమయంలో రసాయనాల తాకిడికి ఊపిరాడక మహమ్మద్ రాజిక్ (34) అనే కార్మికుడు అక్కడే మరణించాడు. మరో ముగ్గురు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment