కరెంటునూ దోచేస్తారు
బొమ్మనహళ్లి: మామూలుగా అధిక చార్జీలతో విద్యుత్‌శాఖ ప్రజలకు షాక్ ఇస్తుంది. కానీ బెంగళూరు నగరంలో కరెంటు దొంగల వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటేటా భారీమొత్తంలో దెబ్బ తగులుతోంది. గత మూడేళ్లలో 645 కరెంటు దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఇక వెలుగులోకి రానివి అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయని విద్యుత్ అధికారులే అంగీకరిస్తున్నారు. కరెంటు పోల్‌కు వైర్లు తగిలించి వాడుకోవడం నుంచి ఆధునిక రూపంలోనూ కరెంటు చౌర్యం సాగుతోంది. బెంగళూరు దక్షిణ విభాగంలోనే 218 కి పైగా చోరీ కేసులు వచ్చాయని బెస్కాం అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు దారులకు గృహ జ్యోతితో ఉచిత కరెంటును ఇస్తున్నా కరెంటు దొంగతనాలు తగ్గడం లేదు. పారిశ్రామిక, వాణిజ్య సర్వీసుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. బెస్కాం జాగృత దళం సిబ్బంది తనిఖీలు చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం చోరులు జాగ్రత్త పడతారు. తరువాత యథావిధిగా విద్యుత్ స్వాహా కొనసాగుతుంది. విద్యుత్ ఉద్యోగుల సహకారం కూడా దొంగలకు ఉంటోందనే విమర్శలున్నాయి.
ఎక్కడెక్కడ అధికం
బెంగళూరులో మూడేళ్లలో 72 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను కరెంటు దొంగలు వాడుకున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లోనే అధికంగా జరుగుతోంది. అనేకచోట్ల నిర్మాణంలో ఉన్న ఇళ్లు, భవనాలవారు అక్రమంగా కనెక్షన్ తీసుకుని దోచుకుంటున్నారు. తనిఖీలలో ఇది బయట పడింది. వెల్డింగ్ షాపులు, పిండి మిల్లులు, పారిశ్రామిక వాడల్లో అనేక చిన్నా చితకా ఫ్యాక్టరీల్లో యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం జరుగుతోందని అధికారులు కనిపెట్టారు. చాలామందికి విద్యుత్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇరుగుపొరుగునుంచి కూడా ఫిర్యాదులు రావడం లేదన్నారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా
ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా కరెంటు చౌర్యం తక్కువేం కాదు. బెంగళూరు నగరంలో జలమండలి సుమారు 16 వేల బోరుబావులకు మోటార్లు బిగించి నీటిని సరఫరా చేస్తోంది. ఇందులో కొన్నిచోట్ల మాత్రమే కరెంటు మీటర్లు తీసుకుని బిల్లులు కడతారు. అనేకచోట్ల దొంగగా విద్యుత్‌ని ఉపయోగిస్తుంటారని బెస్కాం అధికారులు వాపోయారు.
కనెక్షన్లలో ఉన్న లొసుగులను ఉపయోగించి ఆరేడు బోర్లకు ఒకే కనెక్షన్‌ను చూపించి నామమాత్రంగా బిల్లులు కడతారని తెలిపారు. కొన్ని ఆఫీసుల్లో మీటర్‌లు బైపాస్ చేయడం, ట్యాంపరింగ్ ద్వారా తక్కువ బిల్లులు వచ్చేలా చేస్తారు. ఈ నష్టాలను సాకుగా చూపుతూ ప్రభుత్వం ఏటేటా కరెంటుచార్జీలను పెంచుతోంది. దీని వల్ల సక్రమంగా బిల్లులు కట్టే ప్రజలపైనే అధిక భారం పడుతోంది.
బెంగళూరులో భారీగా విద్యుత్
చౌర్యం కేసులు
దాడులు, శిక్షలు బేఖాతరు
కోట్లాది యూనిట్లు దొంగలపాలు
జైలు శిక్షలున్నాయి
కరెంటు చౌర్యం అనేదానికి చట్టప్రకారం శిక్షలున్నాయి. చోరీ చేసిన విద్యుత్‌ను లెక్కించి యూనిట్‌కు మూడు రెట్లు ఎక్కువగా జరిమానా విధిస్తారు. ఇళ్లకై తే యూనిట్‌కు రూ. 5.90, వాణిజ్య భవనాలకు, కర్మాగారాలకు యూనిట్‌కు రూ. 8 చొప్పున లెక్కవేస్తారు. అలాగే నిందితులను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ వేస్తారు. 6 నెలలనుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని, 3 ఏళ్ల వరకు కరెంటు సరఫరా కట్ చేయవచ్చని అధికారులు తెలిపారు. కానీ ఫలితం ఉండడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment