నేత్రపర్వంగా మహాదేవ తాత రథోత్సవం
● వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
● మడితేరు, మహారథోత్సవానికి హాజరు
సాక్షి బళ్లారి: దైవాంశ సంభూతుడు మానవ రూపంలో జన్మించిన మహానుభావుడుగా కీర్తింపబడుతున్న, కోరిన కోర్కెలు తీర్చే శ్రీసద్గురు అల్లీపుర మహదేవ తాత రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం, అల్లీపుర మహదేవ తాత మహారథోత్సవ వేడుకలు రెండూ ఒకే రోజు కావడంతో ఉదయం నుంచి మఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అల్లీపుర తాత సమాధి, విగ్రహాలకు పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మడితేరును లాగగా, సాయంత్రం 5 గంటల తర్వాత మహారథోత్సవ వేడుకలకు వేలాది మంది భక్త జన సమూహం సమక్షంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, ఆలయ మఠం నిర్వాహకులు తదితరులు పాల్గొని మహారథోత్సవానికి ఏర్పాటు చేసిన తాడును ఉత్సాహంగా ముందుకు లాగారు. హొసపేటె ప్రధాన రహదారి ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. ఇదే రహదారిలో రామేశ్వరి నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉండటంతో అల్లీపుర మహాదేవ తాత మఠాన్ని దర్శించుకొని రామేశ్వరి నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment