బనశంకరి: బగర్‌హుకుం పథకం కింద దరఖాస్తు చేసుకుని అర్హులైన వారిలో దురదృష్టవశాత్తూ మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు చట్టప్రకారం భూమి మంజూరు చేసి డిజిటల్ సాగుబడి అందించాలని రెవెన్యూ శాఖమంత్రి కృష్ణబైరేగౌడ రాష్ట్రంలోని తహసీల్దార్లకు సూచించారు. శుక్రవారం వికాససౌధ నుంచి రాష్ట్రంలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. అక్రమ–సక్రమ, బగర్‌హుకుం పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు భూమి పొందడానికి అర్హులు. అలాంటివారికి సాగుబడి చీటి ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం. ఒకవేళ దరఖాస్తు చేసుకున్న వారు మృతి చెందితే వారికి సంబంధించిన అర్హులైన కుటుంబ సభ్యులకు భూమి మంజూరు చేయాలన్నారు. తమకు కావలసిన సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బగర్‌హుకుం దరఖాస్తు చేసుకున్న అర్హులకు న్యాయం అందకపోతే దీనికి అధికారులే బాధ్యత వహించి భూమి మంజూరు చేయాలన్నారు.
ముగ్గురు సర్వేయర్ల సస్పెన్షన్
యశవంతపుర: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై బెళగావి జిల్లాలో రెవెన్యూశాఖకు చెందిన ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే సూపర్‌వైజర్ ఆర్‌సి పత్తార్, సర్వేయర్లు ఎంఐ ముత్తగి, మరో సర్వేయర్‌ను సస్పెండ్ అయ్యారు. ఈమేరకు ఖానాపుర భూమాపన శాఖ కమిషనర్ మంజునాథ్ అదేశాలు జారీ చేశారు. హుళగుంద గ్రామంలోని సర్వే నంబర్ 3లో 508కి సంబంధించి భూమి 11ఎ నక్షను ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించినందుకు పై ముగ్గురిని సస్పెండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికీ రేట్ ఫిక్స్
● కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణ
శివాజీనగర: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానికి రేట్ కార్డు ఫిక్స్ అయింది. రెవెన్యూ శాఖలో అన్ని పోస్టులకు రేట్ ఖరారైందని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల 60 శాతం కమీషన్ ఆరోపణను పునరుచ్ఛరించారు. పర్సంటేజ్ అడగకపోతే వారెందుకు ఆరోపణ చేస్తారని కుమారస్వామి ప్రశ్నించారు. ప్రభుత్వం వారినే అడిగి ఆధారాలు తీసుకోవాలన్నారు. సిద్దరామయ్య మహా నాయకుడు. గతంలో పే సీఎం అని పోస్టర్ అతికించేందుకు వెళ్లారు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ప్రజల ముందు ఉంచలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment