No Headline
బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవస్థానాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి వేంకటేశ్వర దేవస్థానాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికేడ్లు అమర్చి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డు, పొంగల్ అందజేశారు. గాయని వేదావిద్యాభూషణ్‌చే సంగీత కార్యక్రమం నిర్వహించారు. రాజాజీనగర ఇస్కాన్ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణుడికి మహాభిషేకం నిర్వహించి లక్షార్చన, శ్రీనివాస కళ్యాణోత్సవం చేసి వైకుంఠ ద్వారంలో భక్తులకు అవకాశం కల్పించారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఇస్కాన్ ఆలయంలో భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించామని ఇస్కాన్ ప్రజా సంబంధాల అధికారి చైతన్యదాస్ తెలిపారు. లక్ష మంది భక్తులు ఇస్కాన్ దేవస్థానాన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరికీ లడ్డూ ప్రసాదం వితరణ చేశారు.
సీనియర్ సిటిజన్లకు వాహన వ్యవస్థ
సీనియర్ సిటిజన్లకు ప్రవేశద్వారం వద్ద నుంచి దేవస్థానం వరకు వాహన వ్యవస్థ కల్పించారు. మల్లేశ్వరం వయ్యాలికావల్ తిరుమల తిరుపతి ఆలయానికి ఉదయం డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లేశ్వరం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సీఎన్.అశ్వత్‌నారాయణ స్వామివారిని దర్శించుకుని వైకుంఠద్వారంలో ప్రవేశించారు. జేపీ నగర లక్ష్మీవేంకటేశ్వర దేవస్థానంలో, పురాతన వసంతపుర వసంత వల్లభరాయ దేవస్థానంలో, కలాసీపాళ్య పురాతన కోటె వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద వేకువజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. మాగడిరోడ్డు రైల్వేకాలనీలో శ్రీవినాయక వేంకటేశ్వర దేవస్థానంలో అయోధ్య శ్రీరాముడి మాదిరిగా, రామచంద్రాపుర శ్రీపాండురంగ విఠల దేవస్థానంలో వేంకటేశ్వర, గణపతి, శిరిడి సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ పూజలు చేపట్టారు. మైసూరు: మైసూరు జిల్లా సాలిగ్రామ తాలూకా శ్రీక్షేత్ర చుంచనకట్టె గ్రామంలో శ్రీరాముల ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణ చేపట్టారు. వైకుంఠ ద్వారంలో భక్తులు నడిచి స్వామివారిని దర్శించుకున్నారు.
తుమకూరు: తుమకూరు జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేంకటేశ్వర శ్రీరంగనాథ స్వామి, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మైసూరు నగరంలో అవదూత దత్తపీటం ఆవరణలో ఉన్న శ్రీదత్త వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొన్నారు.
అగరలో...
బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం అగర గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ కొలువైన లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అగర, ఇబ్బలూరు పరంగిపాళ్య, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ ,సామసంద్రపాళ్య, చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా అగరలో ఉన్న ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
వైకుంఠద్వార దర్శనంతో
పులకించిన భక్తజనం
అంతటా ఘనంగా
ముక్కోటి ఏకాదశి పూజలు
Comments
Please login to add a commentAdd a comment