వెలుగు రేఖ
● బ్రెయిన్‌డెడ్ అయి అవయవదానం
శివమొగ్గ: అనారోగ్యం వలన బ్రెయిన్‌డెడ్ శివమొగ్గ మహిళ అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళూరులోని వెన్లాక్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. శివమొగ్గ నగరంలోని రాగిగుడ్డలో నివాసం ఉంటున్న పి. రేఖా (41), 6వ తేదీన ఇంటిలో పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే రేఖాను చికిత్స కోసం వెన్లాక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు.. ఆమె మెదడులో రక్తం పూర్తిగా గడ్డకట్టుకుని పోయిందని తెలిపారు. ఆ రోజు నుంచి స్పృహలోకి రాలేదు. చివరకు బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో శనివారం అవయదానానికి కుటుంబ సభ్యులు సమ్మతించారు. రేఖా దేహం నుంచి రెండు కళ్లను సేకరించి మంగళూరులో ఉన్న కేఎంసీ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు, లివర్‌ను మైసూరు నగరంలోని బీజీఎస్ ఆస్పత్రిలోని రోగి కోసం తరలించారు. గుండె, మూత్రపిండాలు తదితర ముఖ్య అవయవాలను సేకరించి అవసరమై రోగులకు పంపించారు.
దర్శన్ గన్ లైసెన్స్ రద్దు?
● పోలీసుల నోటీసులు
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్న హీరో దర్శన్‌కు సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆయన గన్ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. మీ వద్ద ఉన్న గన్ లైసెన్సుకు సంబంధించి వారంలోపు వివరణ ఇవ్వాలని డీసీపీ పద్మిని నోటీసు పంపారు. మీరు హత్య కేసులో నిందితునిగా ఉన్నారు, బెయిలుపై బయట ఉన్నారు, కావున సాక్షులపై మీరు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గన్‌తో వారిని బెదిరిస్తారనే అనుమానాలు ఉన్నాయి. అందువల్ల మీకు ఇచ్చిన గన్ లైసెన్స్ రద్దు చేయాల్సి ఉంది. వారంలోపు మీ అభిప్రాయం తెలపాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. దర్శన్ వివరణ ఇచ్చాక లైసెన్సు రద్దుపై ఓ నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
డబ్బుల కోసం దర్శన్ అర్జీ
రేణుకాస్వామి హత్య జరిగాక దర్యాప్తులో భాగంగా పోలీసులు తన వద్ద సీజ్ చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని దర్శన్ కోర్టుకు మనవి చేసుకున్నారు. దర్శన్, భార్య విజయలక్ష్మి, మరో నిందితుడు ప్రదోష్‌ల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి లక్షలాది రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.
పుట్టినరోజు నాడే నూరేళ్లు
బనశంకరి: పుట్టినరోజు నాడే బాలునికి నూరేళ్లు నిండాయి. బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని చిత్తూరుజిల్లాకు చెందిన భాను తేజ్ (12)ను తీసుకుని సోదరుడు చక్రధరణ్ బైక్‌లో బయల్దేరాడు. భానుతేజ్ తల్లిదండ్రులు రవి, సుమా. బాలుడు ఆర్‌టీ.నగర సత్యాంజనేయస్వామి ఆలయంలో వేదాలు నేర్చుకునేవాడు. హొరమావులోని బంధువుల ఇంట్లో కేక్ కట్ చేసి ఆర్టీ నగరకు తిరిగి వస్తున్నారు. హెణ్ణూరు బండె మెయిన్‌రోడ్డులో ఐషర్‌ట్రక్ వెనుకనుంచి బైకు ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడగా, భానుతేజ తలపై ట్రక్ రెండుచక్రాలు వెళ్లడంతో తల ఛిద్రమై చనిపోయాడు. చక్రధరణ్ కు స్వల్పగాయాలయ్యాయి. ట్రక్‌ను వదిలేసి డ్రైవరు ఉడాయించాడు. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment