తెల్లారిన కూలీల బతుకులు
తుమకూరు: బతుకు తెరువును వెతుక్కుంటూ బయల్దేరిన కూలీలను విధి కాటేసింది. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకాలోని హీరెబాదరదిన్ని గ్రామం నుంచి కూలి పనుల కోసం బెంగళూరుకు వెళ్తున్న కూలి కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్స్ క్రూయిజర్ వాహనం ఆదివారం తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తుమకూరు జల్లాలోని శిర తాలూకాలోని ఎమ్మెరహళ్ళి గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి– 48లో ఈ దుర్ఘటన జరిగింది. వాహనాల కింద చిక్కి మృతులు నుజ్జునుజ్జయ్యారు. ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. పొగమంచుకు తోడు డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం. క్రూయిజర్ డ్రైవర్ బసవరాజు (48), కూలీ సురేష్ (28) మృతి చెందగా, ఆనంద్, వీరేష్, నాగమ్మ, ఆదెవ్వ గాయపడ్డారు. వారిని శిర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment