సేవా దాసోహీ.. ఘన వందనం
తుమకూరు: లోక కళ్యాణం కోసం అలుపెరగకుండా జీవితాన్నే అంకితం చేసి సిద్ధగంగ మఠాన్ని విద్యా కాశీగా ప్రపంచ ప్రఖ్యాతి చేసిన త్రివిధ దాసోహి, నడిచే దేవునిగా పేరొందిన దివంగత డాక్టర్ శివకుమార స్వామీజీ 6వ వర్ధంతిని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మఠాన్ని సుందరంగా అలంకరించారు. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయశంకర్, కేంద్ర మంత్రి వీ.సోమణ్ణ సహా అనేకమంది రాజకీయ ఉద్ధండులు, మఠాధిపతులు, వేలాది మంది భక్తులు పాల్గొని స్వామీజీ సమాధిని దర్శించుకున్నారు. వివిధ రకాల పండ్లు, పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శివయోగి మందిరంలో ఉదయం నుంచే వేదఘోషలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు 108 కలశాలతో రుద్రాక్ష మంటపం నుంచి వస్తుప్రదర్శనశాల వరకు స్వామీజీ చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ ఊరేగింపులో మఠాధిపతి సిద్దలింగ స్వామీజీ, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆయన సేవాస్ఫూర్తి: గవర్నర్
శివకుమార స్వామిజీ జీవిత ప్రయాణం, ఆయన చేసిన సేవను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గవర్నర్ గెహ్లాట్ అన్నారు. వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సామాన్యమైన జీవితం, ఉన్నతమైన ఆలోచలు, వాటిని ఆనుసరించడంతో పాటు ఇతరులను కూడా అదే మార్గంలో తీసుకుని వెళ్లడానికి ప్రేరేపించిన గొప్ప వ్యక్తి శివకుమారస్వామీజీ అని వర్ణించారు. ఆయన సేవలు, జీవితం ప్రజలకు అంకితమని అన్నారు. స్వామీజీకి పద్మవిభూషణ్‌తో సహా అనేక జాతీయ, ప్రపంచస్థాయి అవార్డులు లభించాయని తెలిపారు. 111 సంవత్సరాల పాటు పేదల అభివృద్ధి కోసం కృషి చేసి అన్న, అక్షర దాసోహం సాగించిన గొప్ప మహానుభావులని కొనియాడారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు.
శివకుమారస్వామి వర్ధంతి వేడుకలు
సిద్ధగంగ మఠంలో జనసంద్రం
Comments
Please login to add a commentAdd a comment